● కలెక్టర్ స్నేహ శబరీష్
గార్ల: కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్య బోధించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం గార్లలోని కేజీబీవీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ తనిఖీ సమయంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ లేకపోవడంతో, ఆమైపె చర్య తీసుకోవాలని డీఈఓ సత్యనారాయణమూర్తిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినుల విద్యా ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. పాఠశాలలోని వంటగది, వసతిగృహం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లను పరిశీలించి విద్యార్థినులకు నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగుల వార్డులను పరిశీలించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలు సుకున్నారు. వైద్యులు విధుల్లో సమయపాలన పాటిస్తూ, రోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, గైనకాలజిస్ట్‌ను కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి అలువాల సత్యవతి కలెక్టర్‌ను కోరగా, గూడూరు సీహెచ్‌సీ నుంచి డిప్యుటేషన్‌పై నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. డీఈఓ సత్యనారాయణమూర్తి, డీసీహెచ్‌ఎస్ చింత రమేష్, కేజీబీవీ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గాయత్రి, ఎంఈఓ వీరభద్రం, సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం, తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, స్పెషలిస్ట్ వైద్యులు బాలునాయక్, సతీష్ పాల్గొన్నారు.


