మహబూబాబాద్ రూరల్: భూమిలో తగినంత తేమశాతం ఉన్నప్పుడే విత్తనాలను విత్తుకోవాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల, కంబాలపల్లి, సికింద్రాబాద్ తండా, మాధవాపురం, ఇస్లావత్ తండాల్లో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులు వానాకాలంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి తగిన సలహాలు, సూచనలు అందజేశారు. ఏడీఏ మాట్లాడుతూ.. రైతులు తగినంత తేమశాతం ఉన్నప్పుడే పత్తి, మొక్కజొన్న విత్తనాలను విత్తుకుంటే అవి మంచిగా మొలకేత్తేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులు దళారుల దగ్గర నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలని సూచించారు. అధిక ధరలకు ఎరువులు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
బంద్‌ను విజయవంతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మునగాల మహేష్, జ్యోతిబసు, మాగం లోకేష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో గురువారం విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని ఆరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. యూనివర్సిటీలో మెస్ బకాయిలు రద్దు చేయాలని, నర్సింగ్ విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ విద్యలో డొనేషన్ ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందని, విజయవంతం చేయాలన్నారు.


