అల్పాహారం తయారీకి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అల్పాహారం తయారీకి స్థల పరిశీలన

Jul 2 2026 2:29 AM | Updated on Jul 2 2026 2:29 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం తయారీలో భాగంగా బుధవారం అదనపు కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలించారు. విద్యార్థుల అవసరాల మేరకు అల్పాహారం వండి అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణం వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, నిల్వలకు మాత్రమే సరిపోతుందని మార్కెట్‌ సెక్రటరీ సుజన్‌ బాబు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అదనపు కలెక్టర్‌ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఉన్నారు.

కులాల పేర్లు మార్పు

మహబూబాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం బీసీ–ఏ కేటగిరీలోని కులాల పేర్లను మార్పు చేసిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సాయి శ్రీజ బుధవారం తెలిపారు. సంబంధిత కులాల ప్రతినిధుల వినతులు, సామాజిక పరిస్థితులు, గౌరవప్రదమైన గుర్తింపు అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. బుడబుక్కల కులాన్ని శివక్షత్రియగా, దొమ్మరను గదవంశీయగా, పెన్నార్‌ను దోభీగా, చాకలిని రజకులుగా, పిచ్చిగుంట్లను వంశరాజ్‌గా, వీరముష్టిని నెట్టికోట కులాలుగా పేర్లు మార్పు చేసినట్లు చెప్పారు. ఇప్పటి నుంచి ప్రభుత్వ రికార్డులు, సర్టిఫికెట్లు, సంక్షేమ పథకాల్లో ఈ కొత్త కులాల పేర్లనే నమోదు చేయాలన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపక పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయ కర్త ఉమామహేశ్వరీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎన్టీఆర్‌ స్టేడియం రహదారిలో ఉన్న గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులకు డెమో కాస్లులు ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తామన్నారు.

వీబీ జీ రామ్‌జీ పథకాన్ని

రద్దు చేయాలి

మహబూబాబాద్‌: మోదీ తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకాన్ని రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు డిమాండ్‌ చేశారు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలన్నారు. వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టం రద్దుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల విషయం కొత్త చట్టంలో లేదన్నారు. కూలీల పని హక్కును హరించే కొత్త చట్టాన్ని రద్దు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సోమయ్య, హేమ, నాగన్న, సీతారాం, రాజు, శ్రీను, రాంమూర్తి, భాగ్యమ్మ, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

జర్మనీ వర్సిటీలతో కేయూ ఎంఓయూ

కేయూ క్యాంపస్‌: ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్‌ స్టడీ టూర్‌కు జర్మనీ వెళ్లారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్‌, రూసా కేయూ నోడల్‌ అధికారి ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎం.కుమార్‌ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement