మహబూబాబాద్ రూరల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్‌ఓలు ఓటర్లకు ఫారా ల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలన్నారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని, అధికారులు, బీఎల్‌ఓలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, షెడ్యూలు ప్రకారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు నిర్వహించి పూర్తి సమాచారం అందించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కట్టంచంద్ర రాజేశ్వర్ రావు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్ కవిత, బీఎల్‌ఓ కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్
బీఎల్‌ఓల ఇంటింటి ఫారాల పంపిణీ పరిశీలన


