మహబూబాబాద్: పేదల ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని, 80 గజాలలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో వినూత్న ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసారథిరెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదన్నారు. రియల్టర్లు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ధరణి, భూభారతిల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాట్లు చేసి విక్రయించి కోట్లలాది రూపాయలు సంపాదించారన్నారు. పేదలు 80గజాల్లో గుడిసెలు వేస్తే వాటిని తొలగించి కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. గుడిసెవాసులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఇంటి నంబర్ల కోసం సుమారు పది వేలమంది దరఖాస్తు చేసుకుంటే.. 600 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పట్టాలు, ఇంటి నంబర్లు ఇవ్వాలని, లేని యెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అజయ్‌సారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, పాండు రంగాచారి, సందీప్, శ్రావణ్, వీరన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


