వర్షాకాలంలో పెరుగుతున్న
ప్రమాదాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని జంపన్న వాగులో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతీ వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ పుణ్యస్నానాల కోసం వాగులోకి దిగుతున్న భక్తులు నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతీ ఏడాది ఏదో ఒక చోట మునిగి పలువురు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శాశ్వత భద్రతా చర్యలు మాత్రం కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం, సెలవు రోజులు, వారాంతంలో మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది కుటుంబ సమేతంగా జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తుంటారు. వాగులో లోతైన గుంతలు, వేగవంతమైన వరద ప్ర వాహం గురించి అవగాహన లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు సు మారు ఆరుగురు భక్తులు జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి..
వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు వాగు వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్‌లు, ప్రథమ చికిత్స సౌకర్యాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కోరుతున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో మైకుల ద్వారా భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జంపన్న వాగు పవిత్రతతో పాటు భక్తుల ప్రాణ భద్రత కూడా అంతే ముఖ్యమని, ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలే శాశ్వత పరిష్కారమని వారు అభిప్రాయపడుతున్నారు.
లోతు తెలియక మునిగి పలువురు భక్తుల మృతి
హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి


