మహబూబాబాద్ రూరల్ : కుటుంబ తగాదాలతో మాజీ ఉప సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ ఎన్.అంజలి తెలిపిన వివరాల ప్రకారం.. సింగారం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్య (57) కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. యాకయ్య కుమారుడు, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటుండగా యాకయ్య మరో మహిళతో విహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య యశోద, ఆయనకు తగాదాలు జరిగాయి. దీంతో నాలుగేళ్లుగా యాకయ్య, యశోద వేర్వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఏం జరిగిందేమో కానీ బుధవారం తెల్లవారుజామున యాకయ్య తన ఇంటి ఆవరణలో నిద్రించి ఉన్న మంచంపై దారుణ హత్యకు గురై కనిపించాడు. దుండగులు మారణాయుధాలతో యాకయ్య ముఖం, తల భాగంలో బలంగా కొట్టి గాయపరచడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సోమయ్య తన కుమారుడు యాకయ్య మృతికి కోడలు యశోద, మరికొంతమంది కారణమని ఆరోపిస్తూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రూరల్ ఎస్సై రాజు, సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. దర్యాప్తు అనంతరం నిందితుల వివరాలు వెల్లడిస్తామని రూరల్ సీఐ అంజలి తెలిపారు.
గ్రామంలో భారీ బందోబస్తు..
యాకయ్య దారుణ హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి యాకయ్య అంత్యక్రియలు పూర్తయ్యే వరకు గస్తీ నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
కుటుంబ తగాదాలే కారణం..
సింగారం గ్రామంలో ఘటన
వివరాలు వెల్లడించిన పోలీసులు


