మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని రోడ్లు కొద్దిపాటి వర్షానికే చిత్తడవుతున్నాయి. రోడ్లు గుంతలమయం కావడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను ప్రస్తావిస్తూ సాక్షి దినపత్రికలో ఈనెల 29న ‘చినుకు పడితే చిత్తడే..’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎన్‌హెచ్ అధికారులు స్పదించారు. మంగళవారం కురవి రోడ్డులో జాతీయ రహదారిపై గుంతలను పూడ్చివేశారు.
గిరిజనులకు బీజేపీ
చేసింది శూన్యం
మహబూబాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గిరిజనుల అభివృద్ధికి కృషి చేసినట్లు మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు చేసింది శూన్యమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదన్నారు. దేశ రాజధానిలో సేవాలాల్ భవన్ నిర్మాణం చేసి అధికారికంగా జయంతిని నిర్వహించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ గిరిజనులను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు యాత్రలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన
గార్ల: గార్ల సమీపంలోని పాకాల ఏటిపై నిర్మించే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ డీఈ కృష్ణమోహన్ మంగళవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వర్షాలు పడి ఏరు వచ్చే లోపే బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా అటవీ అధికారిగా లావణ్య
మహబూబాబాద్ రూరల్: జిల్లా అటవీ శాఖ అధికారిగా భూక్య లావణ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న విశాల్ బత్తుల వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న భూక్య లావణ్య బదిలీపై రానున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2026–27విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఏఓ సత్యనారాయణమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, నేటి నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు మండలంలోని ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
మహాగ్రంథం భగవద్గీత
హన్మకొండ కల్చరల్ : భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదని విలువలతో జీవించడానికి మార్గదర్శకమైన మహాగ్రంథమని అభయ హిందూ సేన అధ్యక్షుడు శ్రీశ్రీ రాధామనోహర్ దాస్ ఉద్భోదించారు. మంగళవారం రాత్రి వేయిస్తంభాల దేవాలయాన్ని రాధామనోహర్ దాస్ సందర్శించారు.


