మహబూబాబాద్: నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో టాస్క్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలో భవనాల పరిశీలన పూర్తి చేశారు. ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి పలు కంపెనీలు ఇంటర్వ్యూలు ద్వారా చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో టాస్క్ సెంటర్లు కొనసాగుతున్నాయి. త్వరలో మానుకోటలో ఏర్పాటవుతుంది.
భవనాల పరిశీలన..
జిల్లా కేంద్రంలో టాస్క్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తొర్రూరురు రోడ్డులో, ఈదులపూసపల్లి రోడ్డులోని రెండు భవనాలను టాస్క్ రీజినల్ మేనేజర్ సునీల్ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి పరిశీలించారు. కలెక్టర్ స్నేహశబరీష్ ఫైనల్ చేయనున్నట్లు వారు తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ, ఉపాధి కల్పనశాఖ సమన్వయంతో పని చేస్తుంది. జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇప్పటికే 6,536 మంది ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
కేంద్రంలో ఇచ్చే శిక్షణలు..
కేంద్రంలో సెంటర్ మేనేజర్, ట్రైనర్ ఉంటారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. శిక్షణ ఇచ్చే కోర్సులు వారం నుంచి ఆరు నెలల వరకు ఉంటాయి. బ్యాంకింగ్, ఐసెట్, నెట్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్, ఐటీ కోర్సు, కమ్యూనికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఆఫీస్ డెవలప్‌మెంట్, పరిశ్రమల అవసరాలు తదితర వాటిపై శిక్షణ ఇస్తారు. యువత నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా టాస్క్ పని చేస్తుంది. ఆర్గనైజేషన్ అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.
ఉపాధి అవకాశాలు..
ఆసెంటర్ ద్వారా శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్స్ ఇస్తారు. అలాగే హైదరాబాద్‌లోని పలు కంపెనీలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్లేస్‌మెంట్ ఇప్పించి భరోసా కల్పిస్తారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి
యువత టాస్క్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే దరఖాస్తుల సంఖ్య బట్టి కేంద్రంలో ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు ఉండగా మానుకోటలో మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణతో పాటు ఉపాధి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది.
– శ్రీమన్నారాయణరెడ్డి,
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్
జిల్లాలో ఏర్పాటుకు కసరత్తు
భవనాల పరిశీలన పూర్తి
యువతకు నైపుణ్యాలపై శిక్షణ..
ఉపాధి అవకాశాలు
టాస్క్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహణ


