● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నిందితులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలను కోర్టులో నిరూపించి నేరస్తులకు శిక్ష పడటంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు దర్యాప్తు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సీపీ అభినందిస్తూ మంగళవారం ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. గతేడాది నుంచి నేటివరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 41 కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలకు కోర్టులో శిక్షలు అమలయ్యాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్‌లోను అధికారులు అత్యధిక కేసులను పరిష్కరించారని, ఇదే రీతిలో రాబోయే రోజుల్లో మరిన్ని కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమములో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాము, ఏసీపీలు డేవిడ్‌రాజు, సతీష్‌బాబు, సదయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీనివాస్, సంతోషి, రవి కిరణ్, హరిచంద్ర ప్రసాద్, బృందా దేవి, దుర్గాబాయి, రాజమల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ రావు, కిరణ్ కుమార్, నీజర, ఇన్‌స్పెక్టర్లు సంజీవ్ రావు, మల్లయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


