ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీ జాతి అస్తిత్వం, చరిత్ర పరిరక్షణకు పురావస్తు ఆనవాళ్లు, రాతి చిత్రాలు, పురాతన కట్టడాలు, కోయ, నాయక్‌పోడు, గోండు తెగల ఇలవేల్పులపై పరిశోధనలు నిరంతరం కొనసాగిస్తామని సమ్మక్క–సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ బుగ్గ కోటేశ్వరరావు తెలిపారు. మండల పరిధిలోని కామారంలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న పరిశోధనలకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఆసక్తి వ్యక్తం చేసిందని తెలిపారు. కోయ తెగ ఇలవేల్పుల చరిత్రకు సంబంధించిన వివరాలను తమ సంస్థ నుంచి అధికారికంగా పంపించాలని కోరినట్లు వెల్లడించారు. అలాగే సింధు నాగరికత, కోయ సమాజ సాంస్కృతిక చిహ్నాలపై తాము సమర్పించిన నివేదిక ఆధారంగా మరింత అధ్యయనం చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలో ఏఎస్‌ఐ బృందం మేడారం సందర్శించి సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడంతో పాటు తమ పరిశోధన బృందంతో సింధు లిపిపై చర్చించే అవకాశం ఉందన్నారు. కోయ జాతి చరిత్ర అత్యంత ప్రాచీనమైందనే అంశాన్ని పరిశోధనల ద్వారా వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో పరిశోధన కేంద్రం కోఆర్డినేటర్ సోడే శ్రీరామ్, ఆలం సుధీర్, కలివేటి పవన్, పోలెపోయిన దిలీప్, గొంది రాకేశ్, గట్టుపల్లి అర్జున్, కుంజ కృష్ణప్రసాద్, కొమరం రవి పాల్గొన్నారు.


