పసరగొండ క్రాస్ వద్ద..
దామెర: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన పెండ్లి అనుదీప్ (18) తన మిత్రుడు హరీశ్‌తో కలిసి బైక్‌పై హనుమకొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పసరగొండ క్రాస్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఆటోను సడన్‌గా ఆపడంతో బైక్ ఆటోను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు కిందపడ్డారు. అనుదీప్ తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అనుదీప్ అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఆటో డ్రైవర్ మాల్లారెడ్డి అనిల్ రెడ్డి రోడ్డు భద్రత సూచనలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని, మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో హరీశ్‌కు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా మృతుడి తండ్రి ప్రభాకర్ మూడు నెలల క్రితం కెనాల్‌లో పడి మృతిచెందాడు. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మేక పిల్ల కోసం వెళ్లి మహిళ..
బచ్చన్నపేట : మేతకు తోలుకుపోయిన మేక పిల్ల నీటి కొలనులో పడగా రక్షించడానికి వెళ్లిన కాపరి ప్రమాదవశాత్తు అదే కొలనులో పడి మృతి చెందిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్నరామన్‌చర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నరామన్‌చర్ల గ్రామానికి చెందిన గుండా ఉపేందర్ భార్య వాణి (33) తమ మేకలను మేతకు తీసుకెళ్లింది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన గుర్రాల నర్సిరెడ్డి వ్యవసాయ భూమిలోని ఫారం ఫండ్ నీటిలో మేక పిల్ల పడింది. గమనించిన వాణి మేక పిల్లను రక్షించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మృతి చెందింది. గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. గ్రామంలో నీటి గుంతను తవ్విన గుర్రాల నర్సిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల నాయకుడు రామగళ్ల అశోక్ డిమాండ్ చేశారు. గుంత చుట్టూ ఫెన్సింగ్ వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
టిప్పర్, బైక్ ఢీ.. ఒకరు..
నెక్కొండ: ఎదురెదురుగా వస్తున్న టిప్పర్, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెంది సంఘటన మండలంలోని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామ బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు, 6వ వార్డు సభ్యురాలు శ్యామల భర్త సొల్లేటి సునీల్ (40) ఉదయం నెక్కొండకు పనినిమిత్తం వచ్చి, తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అప్పల్‌రావుపేట ఊర చెరువు మీద నుంచి వెళ్తున్న క్రమంలో మూలమలుపు వద్ద టిప్పర్ అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నెక్కొండ సీఐ శ్రీనివాస్, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని నర్సంపేటలోని మార్చరీకి తరలించారు. సునీల్‌కు భార్య శ్యామల, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని ఎస్సై పేర్కొన్నారు.


