బయ్యారం: మండలంలోని నామాలపాడులోని ఏకలవ్య పాఠశాలలో సోమవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బోరు ఏర్పాటు చేయించి నీటి సమస్య పరిష్కరించాలని ఐటీడీఏ ఏటూరునాగారం పీఓను ఎమ్మెల్యే ఫోన్‌లో కోరారు. అనంతరం పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతూ.. ప్రస్తుత వానాకాలంలో పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున అవసరమైన మందులను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ రాంబాబు, నామాలపాడు, కొత్తపేట సర్పంచులు దీప ప్రకాష్, ప్రవీణ్‌నాయక్, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు’
తొర్రూరు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని తొర్రూరు ఆర్డీఓ గణేష్ సూచించారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. 10 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే సంబంధిత మండల, మున్సిపల్ కార్యాలయాలకు పంపించి అతి తక్కువ సమయంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ పుల్లారావు, లేబర్ ఆఫీసర్ రవి, ఏటీడబ్ల్యూఓ ఉపేందర్, డిప్యూటీ ఈఈ రంజిత్‌నాయక్, సీడీపీఓ రేష్మ, మిషన్ భగీరథ ఈఈ మోహన్, ఏఓ రాంనర్సయ్య, ఎకై ్సజ్ ఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శం ఆ ఉపాధ్యాయుడు
మరిపెడ రూరల్: ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం చాటుతూ జెడ్పీహెచ్‌ఎస్ ఎల్లంపేట జీవశాస్త్రం ఉపాధ్యాయుడు ఐనాల నవీన్ తన కుమారుడు అభినంద్‌ను సోమవారం ఎల్లంపేట ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ విద్యపై తనకున్న నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు నవీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం భాస్కర్‌రావు, పీఎస్ హెచ్‌ఎం జి.వెంకన్న పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు’
గూడూరు: ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాలోని తన నివాసంలో సోమవారం ఎస్‌ఐఆర్ ఫారం స్వయంగా నింపి తహసీల్దార్ నాగభవానికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి బీఎల్‌ఏలు వచ్చి ఎస్‌ఐఆర్ ఫారంలు ఇస్తారని, వాటిని జాగ్రత్తగా నింపి అందించాలన్నారు. గ్రామాల్లో మృతిచెందిన, ఓటరు జాబితాలో డబుల్ పేర్లు ఉంటే తొలగిస్తారన్నారు.


