● రోడ్డెక్కిన దుకాణాలు
● రహదారిపైనే వాహనాల పార్కింగ్
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. చాలా కాలంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ఏకై క ప్రధాన రహదారి రైల్వే స్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు విస్తరించి ఉంది. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డు, గాంధీ సెంటర్, బ్యాంక్‌స్ట్రీట్‌లో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గాంధీసెంటర్‌లో రద్దీ..
పట్టణంలోని గాంధీసెంటర్‌లో కూరగాయల మార్కెట్, మసీదు, పాఠశాలలకు వెళ్లే మార్గాలు, గార్లకు వెళ్లే దారి ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. బ్యాంకు స్ట్రీట్‌లో నాలుగు ప్రధాన బ్యాంకులు, 10 వరకు ఎరువుల దుకాణాలతో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. గాంధీ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో అన్ని రకాల దుకాణాలు, హోటళ్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో పాటు రైల్వే స్టేషన్‌కు వెళ్లే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు వాహనాలు సైతం గంటల తరబడి రోడ్లపై నిలుపుతున్నారు.
రోడ్డెక్కిన దుకాణాలు..
రైల్వే స్టేషన్ రోడ్డు, గాంధీ సెంటర్, బ్యాంకు స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే ఇష్టారాజ్యంగా దుకాణాలను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూరగాయ ల మార్కెట్ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో దుకాణాలను రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. చేప ల మార్కెట్ రోడ్డులో రహదారులపైనే చేపలు, మాంసం విక్రయిస్తున్నారు. కూరగాయలతో పాటు దుకాణాలలో కొనుగోళ్లు చేసేందుకు వచ్చేవారు వా హనాలను రోడ్లపైనే నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. ముత్యాలమ్మగుడి ఎదురుగా మలుపు ఇరుకుగా ఉండటం, దుకాణాలు ఏర్పాటుతో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. గతంలో డ్రైవర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు అక్కడి దుకాణాలను తొలగించారు. అయితే ఇటీవల మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేశారు. రోడ్ల మలుపుల వద్ద సైకిళ్లు, పండ్ల బండ్లను నిలిపి విక్రయాలు జరుపుతుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
రాజకీయ నాయకుల అండతో..
మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రధాన వీధుల్లో రాజకీయ నాయకుల అండతో రాత్రికి రాత్రే రోడ్ల పక్కన దుకాణాలు వెలుస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే కూడళ్లలో దర్జాగా తోపుడు బండ్లు, బడ్డీ కొట్లను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దృష్టి సారించని అధికారులు..
డోర్నకల్‌లో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలను మున్సిపల్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై అడ్డదిడ్డంగా వెలుస్తున్న దుకాణాలను నియంత్రిచడంలో మున్సిపల్ సిబ్బంది, రోడ్లపై ఇష్టారాజ్యంగా నిలుస్తున్న వాహనాలను నియంత్రిచడంలో పోలీసులు విఫలమవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై వెలసిన దుకా ణాలను తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.


