● కలెక్టర్ స్నేహశబరీష్
● ప్రజావాణిలో 205 అర్జీలు
మహబూబాబాద్: ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పని చేయాలన్నారు. ప్రజావాణిలో 205 వినతులు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సర్వే నంబర్ కేటాయించాలి
నేరడ గ్రామంలో ఎకరం భూమి ఉంది. సాగులో ఉన్నాను.. సంబంధిత పత్రాలు ఉన్నాయి. కానీ, రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ కేటాయించడం లేదు. నాలుగు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయంలో వినతి ఇచ్చినా ఫలితం లేక కలెక్టరేట్‌లో అందజేశా.
– డి.రమాదేవి, దివ్యాంగురాలు, నేరడగ్రామం, కురవి
డ్రెయినేజీ నిర్మాణం చేయాలి
జిల్లా కేంద్రం శివారులోని గాయత్రి గుడి ప్రధాన గేట్ ఎదుట డ్రెయినేజీ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. డ్రెయినేజీ నిర్మాణం చేయాలి.
–వంకోజు జలేంద్రాచారి, మానుకోట
భూమి ఇచ్చినా పట్టించుకోవడం లేదు
నాకు రెండు ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కుమార్తెలు కావడంతో బాగోగులు చూసుకోవడానికి పెద్ద కుమార్తె కుమారుడి పేరున 32 గుంటలు రాసి ఇచ్చాను. కానీ, పట్టించుకోవడం లేదు. పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నా. న్యాయం చేయాలి.
–బి.ఎల్లయ్య, మదనతుర్తి గ్రామం, నెల్లికుదురు


