● ఎస్పీ శబరీష్
తొర్రూరు రూరల్: అవగాహనతో సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని ఎస్పీ శబరీష్ అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ.. గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు, మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మధ్వాహ్నం, రాత్రి సమయాల్లో ఇంటి వద్ద లేకుంటే పక్క ఇంటివారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు, దొంగతనాలు, గుర్తు తెలియని ఫోన్‌కాల్స్, ఓటీపీలు, తమ బ్యాంక్ వివరాలపై చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గంజాయి, గుట్కా, గుడుంబా నిర్మూలనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐ గణేష్, ఎస్సైలు మహేందర్‌రెడ్డి, ఖాదర్‌పాషా, సర్పంచ్ ఈనెపల్లి భద్రమ్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


