నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు విడుదల

Jun 30 2026 1:12 AM | Updated on Jun 30 2026 1:12 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశా ల (అటానమస్‌) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌, ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లం నవీన్‌తో కలిసి విడుదల చేశారు. కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, నర్సంపేట డిగ్రీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి కమలాకర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాజీరు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను కళాశాలలోనే అందుబాటులో ఉంచారు.

చిన్న నిర్లక్ష్యం..

గాల్లో కలిసిన ప్రాణం

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ధర్మగడ్డ తండాలో ఘటన

నెల్లికుదురు : చిన్న నిర్లక్ష్యానికి ఓ ప్రాణం గాల్లో కలిసింది. తన ఇంట్లో విద్యుత్‌ తీగకు అతుకు ఉన్నచోట టేపు వేయకుండా వదిలేయడమే కాకుండా ఇనుప వస్తువులకు తాకేలా ఉందా లేదా అనే విషయం చూసుకోకుండా వదిలేయడంతో షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం కాస్య తండా శివారు ధర్మ గడ్డ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్‌ బాబు కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్‌ సురేశ్‌ (35) తన అన్న, బావమరిదితో కలిసి ఈ నెల 28న రాత్రి ఇంటిపై నిద్రించారు. అర్ధరాత్రి వర్షం వస్తుండగా సురేశ్‌ తాను నిద్రిస్తున్న ఇనుప మంచం ఎత్తుకుని మెట్లపై నుంచి దిగుతున్నాడు. ఈ క్రమంలో దారిలో ఉన్న విద్యుత్‌ వైరుకు ఉన్న అతుకుకు ఇనుప మంచానికి తగిలి షాక్‌ గురై మెట్ల పైనుంచి కిందపడ్డాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. సురేశ్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చెరువులో పడి బాలుడు..

ఖిలా వరంగల్‌ : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. ఈఘటన కమ్మరికుంటలో చోటు చేసుకుంది. ఏనుమాముల పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నల్లబెల్లికి చెందిన ఓ మహిళ బతుకుదెరువు నిమిత్తం తన కుటుంబంతో కలిసి ఆరెపల్లి గ్రామంలో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఆమె కుమారుడు కామెర శ్రీవిష్ణు సహస్ర సూర్యతేజ (11) సోమవారం సాయంత్రం గ్రామంలోని కుమ్మరికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. బహిర్భుమికి వెళ్లిన ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మృతుడి అక్క శ్రావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జవ్వాజి సురేశ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement