● ఖానాపురంలో రెండోరోజు సంచారం?
ఖానాపురం : చిరుత పులి కోసం అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలో ఆదివారం చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాగంపేట గ్రామానికి చెందిన పలువురు చిరుత పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సోమవారం సమాచారం అందించారు. దీంతో సెక్షన్ ఆఫీసర్ పద్మారావు, బీట్ ఆఫీసర్ యోగి, శోభన్, బేస్ క్యాంపు నాగరాజు ఘటనాస్థలికి చేరుకుని ప్రజల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అనంతరం తహసీల్దార్ నంగునూరి రమేశ్, ఎస్సై రామ్మోహన్, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేశ్.. చిరుతపులి కనిపించిందనే అనుమానం వ్యక్తం చేసిన ప్రజల వద్ద వివరాలు తెలుసుకున్నారు. గ్రామ శివారులో ఆయిల్‌పాం తోటలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పాదముద్రలు సేకరించారు. కాగా, సోమవారం రాగంపేటకు చెందిన మహిళా రైతు విజయ వ్యవసాయ భూమి వద్ద పని చేస్తుండగా చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలుపగా మరోసారి అటవీ అధికారులకు తెలిపారు. అయినా వారు నామమాత్రంగానే అన్వేషణ చేపట్టి వదిలేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా మండల పరిధిలోనే చిరుతపులి సంచరిస్తూనే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చిరుతపులి జాడ కనిపెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.


