● సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో భయం.. భయం
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పాముల భయం నెలకొంది. తాజాగా శనివారం ఎస్‌ఎన్‌సీయూ పిల్లల వార్డులోని సింక్ వరకు ఓ పాము రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. పసికందులు ఉండే ఫొటోథెరపి రూంలోకి పాము వచ్చి బల్లిని నోటకరుచుకోవడంతో సిబ్బందితోపాటు తల్లులు భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత పాము వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం కూడా ఓ పాము వచ్చిందంటూ పేషెంట్ల అటెండెంట్లు తెలిపారు. ఇలా పాములు వస్తే మా బిడ్డలు, పసికందుల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. పాముల విషయంపై ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ డాక్టర్ సృజన్‌ను వివరణగా కోరగా... పాము వార్డులోకి వచ్చినట్లు తెలిసిందని, అప్పుడు తాను కలెక్టరేట్‌లో ఉన్నానని చెప్పారు. అయినా వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించామని తెలిపారు. పాములు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


