మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని రోడ్లు కొద్దిపాటి వర్షానికే చిత్తడవుతున్నాయి. రోడ్లు గుంతలమయం కావడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. పలు కాలనీల్లో రోడ్లు జలమయం కావడంతో నడక కూడా నరకప్రాయంగా మారుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్ పనులతో కూడా పలు రోడ్లు ధ్వంసమయ్యాయి.
75స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో..
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా ఓటర్లు 65,712 మంది ఉన్నారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. మున్సిపాలిటీ 75 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సుమారు 200కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలుస్తోంది.
జిల్లా కేంద్రంలో సుమారు 50శివారు కాలనీలు ఉన్నాయి. కాగా, పాత బజార్‌లోని ఏఎల్‌నగర్, బీటీఆర్‌నగర్, వెల్పుల సత్యంనగర్, సుందరయ్యనగర్ అంబేడ్కర్ కాలనీ, ఎన్‌ఎన్ నగర్, పలు కాలనీలో అంతర్గత రోడ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. కొత్త బజార్‌లోని 22,23,24,25,26 వార్డుల్లోని పలు కాలనీల్లో కూడా అంతర్గత రోడ్లు సరిగా లేవు. కాగా వర్షం పడినప్పుడు రోడ్లన్నీ జలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామాలైన ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి, అనంతారం, బేతోలు, రజాలిపేట, శనిగపురం గ్రామాల్లో కూడా రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. విలీన గ్రామాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి డ్రెయినేజీ రోడ్ల సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల కౌన్సిలర్లు ప్రతీ కౌన్సిల్‌లో మొరపెట్టుకుంటున్నారు.
జనసంచారం లేని ప్రాంతాల్లో రోడ్లు..
కంకరబోడ్ ప్రాంతంలోని ఎల్‌బీ స్కూల్ సమీపంలో జనసంచారం లేని చోట సీసీరోడ్డు నిర్మాణం చేశారు. అలా పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మానుకోట అభివృద్ధి కోసం రూ.59 కోట్లు విడుదల చేయించారు. ఆ నిధులతోనైనా రోడ్ల నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలో సమస్యలు ఇలా..
జిల్లా కేంద్రంలోని ప్రధాన సెంటర్లలోని రోడ్లు కూడా గుంతలమయంగా మారాయి.
ఈనెల 27న కురిసిన కొద్దిపాటి వర్షానికే పలు సెంటర్లలో రోడ్లు జలమయమై వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
కొత్తబజార్‌లోని బంధం చెరువు నుంచి కురవి రోడ్డు ఆర్వోబీ వరకు రోడ్డు గుంతలమయంగా మారి, వర్షానికి నిండిపోయాయి.
జిల్లా ప్రధాన వైద్యశాల ముందు నుంచి నెహ్రూసెంటర్ సిగ్నల్ పాయింట్ వరకు రోడ్డుపై గుంతలు పడ్డాయి. వర్షపు నీటితో నిండిపోయాయి.
శ్రీరామ మందిరం రోడ్డులో కూడా గుంతలు ఉండటంతో వర్షపు నీటితో నిండాయి.
రైల్వే ఏక్యాబిన్ రోడ్డులో రహదారి పూర్తిగా దెబ్బతినడంతో బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
పాత బజార్‌లోని పలు ప్రధాన సెంటర్‌లతో పాటు మదర్ థెరిస్సా సెంటర్ నుంచి వివేకానంద సెంటర్ వరకు మిషన్ భగీరథ పైపులైన్ కోసం రోడ్డు ధ్వంసం చేశారు.
శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో మరీ దారుణం.
మానుకోట పట్టణంలో కొద్దిపాటి
వర్షానికే రోడ్లు జలమయం
మిషన్ భగీరథ పనులతో ధ్వంసం
అసంపూర్తి కాల్వలే ప్రధాన కారణం
జనసంచారం లేని ప్రాంతాల్లో మాత్రం రోడ్ల నిర్మాణాలు
శివారు కాలనీలో పరిస్థితి దారుణం
ఎల్ నగర్, బీటీఆర్‌నగర్‌తోపాటు శివారు కాలనీలో అంతర్గత రోడ్లు పూర్తిస్థాయిలో లేవు. ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల నిర్మాణాలు చేయాలని పలు మార్లు వినతులు ఇచ్చారు.
–కుమ్మరి కుంట్ల నాగన్న, స్థానికుడు
విలీన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేయాలి
విలీన గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ లో కలిపిన తర్వాత పన్నులు పెరిగినవి తప్ప అభివృద్ధి జరగలేదు. ప్రధానంగా రోడ్ల సమస్య పరిష్కరించాలి.
–ఖాదర్ బాబా, బేతోలు గ్రామం


