మహబూబాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ పర్యటన వాయిదా పడినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 29న(సోమవారం) మహబూబాబాద్ పట్టణంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమీక్షించాల్సి ఉండగా.. కేటీఆర్‌కు తీవ్ర జ్వరం రావడంతో పర్యటన వాయిదా పడినట్లు చెప్పారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.
ప్రభుత్వం సూచించిన సన్నాలు సాగు చేయాలి
తొర్రూరు: ప్రభుత్వం సూచించిన వరి సన్నరకాలు మాత్రమే సాగు చేయాలని ఏడీఏ శ్రీదేవి తెలిపారు. ఆదివారం తొర్రూరు పట్టణంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న విత్తన మేళాను సందర్శించారు. రైతులకు వివిధ రకాల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 7 వరి రకాలను సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ లభిస్తుందని తెలిపారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక పంటలను ఎంచుకోవాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పప్పు ధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యూరియాను సిఫార్సు చేసిన మోతాదులోనే విడతల వారీగా వినియోగించుకోవాలని కోరారు. తక్కువ నీటితో పండే అంతర పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. విత్తనాలు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు, విత్తన ట్యాగ్‌లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓలు రామ నర్సయ్య, స్వామి నాయక్, రైతులు పాల్గొన్నారు.
వందశాతం అవకాశం కల్పించాలి
కొత్తగూడ: షెడ్యూల్డ్ ప్రాంతంలోని అన్ని ఉద్యోగాల్లో ఆదివాసీలకు వందశాతం అవకాశం కల్పించాలని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయబాబు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని క్రీడా పాఠశాలలో జరిగిన ఆట జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఓ నంబర్ 3ని సవరిస్తూ మరో జీఓ విడుదల చేయాలని సూచించారు. గిరిజనేతరులతో కలిపి పదోన్నతులు కల్పించడం అన్యాయం అన్నారు. ఈ సమావేశంలో సువర్ణపాక పాపారావు, ప్రభాకర్, సారయ్య, ముడిగ సమ్మయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, సురేందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ బావి వద్ద మొసలి
కొత్తగూడ: మండలంలోని ఎంచగూడెం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఆదివారం మొసలి స్థానికులకు కనిపించింది. వాసం వీరస్వామి వ్యవసాయ బావి వద్ద మొసలిని చూసిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. కాగా, అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకుని పాకాల సరస్సులో వదిలి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నేటి నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధి కారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసీం ఇక్బాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29, జూలై 1, 3, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు.


