● పల్స్ పోలియో కార్యక్రమాన్ని
ప్రారంభించిన కలెక్టర్ స్నేహశబరీష్
● జిల్లాలో 96శాతం వ్యాక్సినేషన్ పూర్తి
నెహ్రూసెంటర్: పోలియో రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. ఆదివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 0నుంచి5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. పిల్లలకు పోలియో రాకుండా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ముందుండాలన్నారు. డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. 469 కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలు 76,660 మందికి గానూ 73,570 మందికి 96శాతం పోలియో చుక్కలు వేశామని పేర్కొన్నారు. మొదటి రోజు చుక్కలు వేసుకోని పిల్లలకు ఈనెల 29,30వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి వేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, 19వ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణజ్ఞానేశ్వర్, 33వ వార్డు కౌన్సిలర్ బి.అజయ్‌సారథిరెడ్డి, వ్యాధి నిరోధక టీకాల అధికారి శివకుమార్, డెమో రాజ్‌కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ స్వామి, పురుషోత్తం, శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పల్స్‌పోలియో కార్యక్రమ పరిశీలకుడు జాన్‌బాబు పట్టణంలోని సాలర్‌తండా కేంద్రాన్ని సందర్శించి ప్రతీ చిన్నారికి చుక్కలు వేసేలా వైద్య సిబ్బంది చొరవ చూపాలని తెలిపారు.


