కట్టు తప్పుతున్న ఖాకీలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

కట్టు తప్పుతున్న ఖాకీలపై కొరడా

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

వరంగల్‌ క్రైం : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కట్టు తప్పుతున్న అధికారులపై పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ కొరడా ఝులిపిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వేటు వేస్తున్నా మిగతా వారికి భయం ఉండడం లేదు. భూ వివాదంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై ధర్మసాగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావును ఏఆర్‌కు అటాచ్డ్‌ చేసి 24 గంటల గడవకముందే పీడీఎస్‌ బియ్యం వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన నర్మెట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.అబ్బయ్య, బచ్చన్నపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే హమీద్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్‌లో కలకలం సృష్టించింది. భూ వివాదాల్లో తలదూర్చవద్దని, ఇతర సెటిల్‌మెంట్లు చేయొద్దని పోలీస్‌ ఉన్నతాధికారులు నెలవారీ నేర సమీక్ష సమావేశాల్లో పదేపదే చెబుతున్నా కొందరి తీరులో మార్పురావడంలేదు. పోస్టింగ్‌ ఉన్న రోజుల్లోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న కక్కుర్తి.. చివరికి ఉద్యోగం ఊడేదాకా తెచ్చుకుంటోంది.

పోలీస్‌ శాఖకు అవినీతి మరకలు..

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిస్టర్‌ కూల్‌గా పేరుంది. కానీ నిబంధనలను అతిక్రమించిన అధికారులపై తనదైన శైలిలో చర్యలు చేపడుతున్నారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై నిఘా (ఎస్‌బీ) అధికారులతో నివేదికలు తెప్పించుకోవడంతోపాటు క్యాట్‌పార్టీ అధికారులతో కూడా సమాచారం తెప్పించుకుని చర్యలు తీసుకుంటున్నారు.

● ఒకే సబ్‌ డివిజన్‌లో పనిచేసిన ఏసీపీ నందిరాంనాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ గోపి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విఠల్‌పై సస్పెన్షన్‌ వేటు పడడం అప్పట్లో కమిషనరేట్‌లో సంచలనంగా మారింది.

● మామునూరు ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఒంటేరు రమేశ్‌తోపాటు ఆయన గన్‌మెన్‌పై వేటు పడింది.

● ఏప్రిల్‌ 29న హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ టి.రాములు మ ద్యం మత్తులో ఉండడంతో అతనిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

● ఏఆర్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబు ల్‌గా పనిచేస్తూ అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వాటిని తీర్చలేని వారిపై వేధింపులకు పాల్పడిన ట్లు వచ్చిన ఆరోపణలపై ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబు ల్‌ యాదగిరిపై వేటు పడింది. అదేరోజు చెన్నారావుపేట పీఎస్‌ కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణల్లో సతీశ్‌పై వేటు పడింది.

● ఏప్రిల్‌ 23న అవినీతి ఆరోపణలపై నర్సంపేట ఎస్సై రవికుమార్‌, ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్‌కుమార్‌పై వేటు పడింది.

● విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై ఏప్రిల్‌ 10న ఆత్మకూరు ఎస్సై సతీశ్‌పై వేటు పడింది.

● మద్యం మత్తులో ఓ షాపు యజమానిపై చెయ్యి చేసుకున్నందుకు మిల్స్‌కాలనీ ఎస్సై శ్రీకాంత్‌, మద్యం మత్తులో విధులు నిర్వర్తించిన మడికొండ హెచ్‌సీ మోహన్‌రావుపై వేటు పడింది.

● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తప్పుడు మాటలు చెప్పి నాలుగేళ్లు లైంగికదాడి, ఆపై బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీసీఎస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోదారి రాజ్‌కుమార్‌ను హనుమకొండ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

● మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మిల్స్‌ కాలనీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌పై వేటు పడింది.

..ఇలా పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కాసుల కోసం వెంపర్లు ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూములు..సెటిల్‌మెంట్లకే ప్రాధాన్యం..

పలు పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారుల ప్రాధాన్యాలు మారిపోయాయి. భూములు, సెటిల్‌మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం మొదలవడంతో వ్యవసాయ భూముల దగ్గర జరుగుతున్న పంచాయితీలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. వరంగల్‌ సబ్‌ డివిజన్‌లో పర్యవేక్షణ అధికారి (ఏసీపీ )లేకపోవడంతో ఓ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ తన పరిధిలో పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సొంత కారు వచ్చింది అంటే ఆ రోజు పెద్ద సెటిల్‌మెంట్‌ జరిగి నట్లు సిబ్బంది కోడై కూస్తున్నారు.

● పరకాల సబ్‌ డివిజన్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ తన దగ్గర పనిచేసే ఎస్సైలకు నెలవారీ మామూళ్ల చిట్టాను అందించి వాటి వసూళ్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయన నోటి నుంచి పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చెప్పి సిబ్బందిని భయాభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణాలు వినిపిస్తున్నాయి.

● కాజీపేట సబ్‌ డివిజన్‌లో ఓ పీఎస్‌లో వింత పరిస్థితి నెలకొంది. అక్కడ ఓ ఇన్‌స్పెక్టర్‌ కేసుల నమోదులో తీవ్ర నిర్లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆరోపణాలు ఉన్నాయి. దీంతో ఇన్‌స్పెక్టర్‌ రైటర్‌ ఇదే అదునుగా భావించి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్పీడ్‌ పెంచిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

అధికారులపై అవినీతి ఆరోపణలు.. వరుస సస్పెన్షన్లతో కలకలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement