తల్లిదండ్రులూ.. ఆలోచించండి! | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులూ.. ఆలోచించండి!

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

మైనర్‌ డ్రైవింగ్‌తో

పెరుగుతున్న ప్రమాదాలు

సాక్షి, వరంగల్‌: ‘మా బాబు బాగా డ్రైవింగ్‌ చేస్తా డు..’ ‘స్కూల్‌కు వెళ్లడానికి మాత్రమే..’ అంటూ మై నర్ల చేతికి బైక్‌లు ఇస్తున్న తల్లిదండ్రులు.. తెలియకుండానే వారి ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తున్నారు. వారం రోజుల క్రితం పర్వతగిరి మండల కేంద్రంలో మైనర్‌ నడిపిన బైక్‌ ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తన ప్రాణం కూడా పోయింది. క్షణం నిర్లక్ష్యం ముగ్గురి కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మైనర్‌ డ్రైవింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌.. మైనర్‌ డ్రైవింగ్‌ హాట్‌స్పాట్‌లుగా ఉండే స్కూళ్లు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఉదయం ఎనిమిది నుంచి పది గంటలు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య మైనర్లు ఎక్కువ వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రమాదం సెకనులోనే..

మైనర్లకు ట్రాఫిక్‌ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియదు. ఓవర్‌టేకింగ్‌, వేగ నియంత్రణ, బ్రేకింగ్‌ వంటి విషయాల్లో అనుభవం లేకపోవడంతో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న విద్యార్థుల్లో గణనీయమైన సంఖ్య మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. ‘ఈ నెల 21న పర్వతగిరి మండల కేంద్రంలో 17 ఏళ్ల చరణ్‌ నడుపుతున్న బైక్‌.. ఎదురుగా వస్తున్న వడ్లకొండ ఎల్లగౌడ్‌(58), ఎండీ అహ్మద్‌ (58) ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంతో ఢీకొనడంతో చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఎల్లగౌడ్‌, అహ్మద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అలాగే, చరణ్‌ బైక్‌పై ఉన్న అతడి స్నేహితుడు చరణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగింది’ అని పోలీసులు గుర్తు చేస్తున్నారు.

శిక్ష పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకు కూడా..

‘ఇంటి నుంచి స్కూల్‌కు దగ్గర దూరమే అనే భావన. పిల్లల ఒత్తిడికి తల్లిదండ్రులు లొంగిపోవడం. పోలీసులు పట్టుకోరనే నిర్లక్ష్యం. స్నేహితుల ప్రభావంతో బైక్‌ నడపాలనే ఆసక్తి. సోషల్‌ మీడియాలో స్టంట్ల ప్రభావం’ ఈ అంశాలతోనే మైనర్‌ డ్రైవింగ్‌లు ఎక్కువవుతున్నాయుని సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ‘18 ఏళ్లలోపు పిల్లలు బైక్‌ నడిపితే కేసు కేవలం వారిపైనే కాదు. వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యజమానిపైనా నమోదవుతుంది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షకూ అవకాశముంది. భవిష్యత్‌లో లైసెన్స్‌ రావడం కష్టమవుతుంది. పిల్లలు అడిగారని బైక్‌ ఇవ్వడం కంటే వారి భద్రత కోసం ‘ఇంకా రెండేళ్లు ఆగు’ అని చెప్పడం గొప్ప ప్రేమ. చిన్న నిర్లక్ష్యం జీవితాంతం తీరని విషాదంగా మారకముందే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి’ అని సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు.

పిల్లలకు ప్రేమతో ఇచ్చే బైక్‌..

ప్రాణాలకే ముప్పు

చట్టం కఠినమే..

అయినా మారని పేరెంట్స్‌ తీరు

స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవడంతో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

ఇటీవల పర్వతగిరిలో ఇద్దరి ప్రాణాలు తీసి మృతి చెందిన మైనర్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

మైనర్‌ డ్రైవింగ్‌పై నమోదైన

కేసుల వివరాలు

సంవత్సరం కేసులు

2024 174

2025 191

2026 96

ఏం పరిణామాలుంటాయంటే..

18 ఏళ్లు పూర్తయితేనే ద్విచక్ర వాహనం

నడపాలి

ౖలెసెన్స్‌ తప్పనిసరి

మైనర్‌కు బైక్‌ ఇస్తే వాహన యజమానిపై కూడా కేసు

రూ.25 వేల వరకు జరిమానా

మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం

వాహనం రిజిస్ట్రేషన్‌పై చర్యలు

భవిష్యత్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌పై ప్రభావం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement