ఆశల జల్లులు | - | Sakshi
Sakshi News home page

ఆశల జల్లులు

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026

జిల్లాలోని 13 మండలాల్లో చిరుజల్లులు

పత్తి, పునాస, పచ్చిరొట్టకు ఆసరా

మరో వాన పడితే ఖరీఫ్‌ వరి సాగుకు సై

సాక్షి, మహబూబాబాద్‌: మొఖం చాటేసిన మేఘాలతో అన్నదాత ఆందోళన చెందుతున్నారు. వర్షం కోసం జిల్లా వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. కోలాటాలు ఆడుతున్నారు. బండపాశం వండుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో శుక్రవారం సాయంత్రం మొదలైన చిరుజల్లులు, శనివారం ఉదయం వరకు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పత్తి, పునాస, పచ్చిరొట్ట పంటలకు ఉపశమనంగా ఉంటుందని సంతోషపడుతున్నారు.

పత్తి పంటకు ఆసరా

జిల్లాలో కురిసిన జల్లులతో పత్తి పంటకు ఆసరాగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. జూన్‌ నెలలో దుక్కులు దున్నుకొని బావులు, బోర్ల నీళ్లతో దుక్కులు తడిపి కొందరు, వట్టి దుక్కిపై మరికొందరు పత్తి విత్తనాలు నాటారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు విత్తినట్లు అంచనా. అదేవిధంగా పునాస పెసర, నువ్వులు, కందుల విత్తనాలు చల్లారు. దీంతోపాటు పచ్చిరొట్ల పిల్లిపెసర, జీలుగ, జనుము విత్తనాలు చల్లారు. అయితే వర్షాలు లేకపోవడంతో మొలిచిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. భూమిలోనే ఉన్న విత్తనాలు పాడవుతున్నాయని రైతులు ఆందోళన చెందారు. ఇప్పుడు కురిసిన వర్షాలతో కొంత మేరకు ఉపశమనంగా ఉంటుందని, మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో పెద్ద వర్షం వస్తే వాగులు, చెరువులు, కుంటల్లో నీరు చేరుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశగా చూస్తున్నారు.

బయ్యారంలో భారీ వర్షం

బయ్యారం: తొలకరి ఆరంభం నుంచి భారీ వర్షం కురవక పంటలసాగుపై ఆశలు వదులుకుంటున్న రైతులకు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షం ఆశలు రేకెత్తించింది. బయ్యారం, జగ్గుతండా, వెంకట్రాంపురం, కొత్తపేట, ఇర్సులాపురం తదితర పంచాయతీల్లో కురిసిన భారీ వర్షంతో పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. ప్రత్తి, మొక్కజొన్న, పెసర పంటలతో పాటు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేసే రైతులకు ఈ వర్షం ఉపయోగకరంగా మారింది.

మరిపెడలో..

మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం భారీ వర్షం కురవడంతో పలు వీధులు జలమయమయ్యాయి. జాతీయ రహదారి కార్గిల్‌ సెంటర్‌లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థితి లేక అవస్థలు పడ్డారు. రామావిలాస్‌ సందు, పూలబజారు తదితర వీధుల్లో వర్షపు నీరు నిలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement