పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయ్‌!

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జూన్‌ మాసంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో వీధికో స్కూల్‌ చొప్పున వెలుస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ స్కూల్‌లో చేర్పించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అర్హతలేని వారు సైతం పాఠశాలలు నెలకొల్పుతూ అందినకాడికి దండుకుంటున్నారు. విద్యా సంస్థల నిర్వహణలో ప్రైవేట్‌ ఇష్టారాజ్యం, గుర్తింపు లేకుండానే స్కూళ్లు ప్రారంభించడం, నాలుగైదు స్కూళ్లకు అనుమతులు తీసుకుని పదుల సంఖ్యలో బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు సెక్షన్లు అంటూ మాయాజాలంలో పడేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ తరగతికి రెండు కంటే ఎక్కువ సెక్షన్లు నిర్వహించకూడదు. అయినప్పటికీ ఏ పాఠశాలలో చూసినా ఆ నిబంధనలు అమలు అవుతున్నట్లు కనిపించడం లేదు.

ప్రభుత్వ నిబంధనలు ఇవీ..

ప్రైవేట్‌ స్కూళ్లలోని నిరుపేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించాలనే నిబంధన ఆర్‌టీఈ చట్టంలో ఉంది. సెక్షన్‌ 18 ప్రకారం ప్రైవేట్‌ స్కూళ్లు తమ స్థాయి, మౌలిక సదుపాయాలు, ఫీజుల వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. పాఠశాలను నిర్వహించాలంటే తప్పనిసరిగా భవన యజమానితో లీజు అగ్రిమెంట్‌ ఉండాలి. కనీసం ఐదేళ్ల లీజు ఉండేలా భవన యజమాని అనుమతి ఇవ్వాలి. భవనంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలి. అగ్నిమాపకశాఖ నుంచి ధృవపత్రం పొందాల్సి ఉంటుంది. అలాగే పాఠశాల ఏర్పాటుతో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగదని సంబంధిత ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ధృవపత్రం తీసుకోవాలి. పాఠశాల భవన గదుల్లో బోధనకు రీసౌండ్‌ సంబంధించి సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. పట్టణాల్లో అయితే 2వేల చదరపు మీటర్ల విస్తీర్ణం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మైదానం ఉండాలి. అయితే పట్టణాల్లో 2 వేల చదరపు మీటర్ల మైదానం సాధ్యం కానందున ఇండోర్‌గేమ్స్‌ కోసం అనుమతి ఇస్తారు. లేదంటే ప్రభుత్వ మైదానాలు, పార్కుల్లో ఆటల కోసం లీజు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ తరగతికి ఒక సెక్షన్‌ నిర్వహించుకోవచ్చు. ఒకవేళ అదనంగా మరొక సెక్షన్‌ నిర్వహించుకోవాలంటే ప్రభుత్వానికి రూ.20వేల చలానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అనుమతి ఇస్తుంది. ఉన్నత పాఠశాలలకు ఆర్‌జేడీ ద్వారా పాఠశాలల విద్యాశాఖ కమిషనర్‌ నుంచి అనుమతి పొందాలి.

అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన..

పుట్టగొడుల్లా వెలుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలల్లో చాలా వాటిలో అర్హత లేని ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నట్లు సమాచారం. చాలా పాఠశాలల్లో కేవలం ఇంటర్మీడియట్‌, డిగ్రీ అర్హతలు ఉన్నవారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో డీఈడీ శిక్షణ పొంది ఉన్నట్లయితే విద్యార్థుల మనస్థత్వాన్ని ఎరిగి వారిని విద్య పట్ల ఆకర్షితులను చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత తరగతులు బోధించే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బీఈడీ, టెట్‌ అర్హత సాధించి ఉండాలి. అయితే ఎలాంటి ట్రైనింగ్‌ లేకున్న కేవలం అకడమిక్‌ అర్హతలతోనే ఉపాధ్యాయలుగా నియమిస్తున్నట్లు తెలుస్తుంది.

గుర్తింపు లేకపోతే సీజ్‌ చేస్తాం..

తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూళ్లలో చేర్చే ముందు ఆయా పాఠశాలలు ప్రభుత్వ అనుమతి తీసుకున్నాయా లేదా పరిశీలించుకోవాలి. లేదంటే పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు గుర్తింపు లేని పాఠశాలలను సీజ్‌ చేస్తాం. జిల్లాలో గుర్తింపులేని పాఠశాల జాబితాను సిద్ధం చేశాం. త్వరలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

– ఏ.సత్యనారాయణమూర్తి, డీఈఓ

జిల్లాలో ప్రైవేట్‌ స్కూళ్ల ఇష్టారాజ్యం

పోటాపోటీగా పెరుగుతున్న పాఠశాలలు

బహుళ అంతస్తుల భవనాల్లో

విద్యాలయాలు

అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన

పట్టించుకోని సంబంధితశాఖ అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement