● వాహనాలకు గొలుసులు,
తాళ్లు కట్టడం చట్ట విరుద్ధం
● వరంగల్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జాఫర్
మహబూబాబాద్ రూరల్: రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు, ఇతర వాహనదారులను పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేయొద్దని వరంగల్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ.జాఫర్ అన్నారు. పార్కింగ్ కష్టాలు అనే శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి రైల్వే శాఖ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా రైల్వే వరంగల్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జాఫర్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని కొత్త బజారు వైపున గల పార్కింగ్ స్టాండ్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న వాహనాలకు తాళ్లు కట్టి ఉంచడానికి గమనించి వాటికి ఉన్న తాళ్లను తొలగించాలని పార్కింగ్ స్టాండ్ నిర్వాహకుడు సతీష్‌ను ఆదేశించారు. వాహనాలకు గొలుసులు, తాళ్లు వేసి కట్టిపెడితే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పార్కింగ్ స్టాండ్‌కు కేటాయించిన స్థలం వరకు మాత్రమే వాహనాల పార్కింగ్ కోసం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ఖాళీ ప్రదేశాల్లో వాహనాలు నిలుపుదల చేస్తే ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు చూసుకుంటారన్నారు. ప్రయాణికులు, ఇతర వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.


