నెహ్రూసెంటర్: ఏటా వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రస్తుతం ఇల్లు, బయట, వ్యవసాయ క్షేత్రాల వద్ద విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గాలి వానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్‌లైన్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాగా, ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదాలు..
జిల్లాలో వ్యవసాయ పొలాల వద్ద పశువులు, రైతులు మృతి చెందుతున్న సంఘటనలు ఉన్నాయి. వర్షాలు, గాలి వానల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతులు, ప్రజలు వానాకాలం విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తీగలపై దుస్తులు ఆరవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వర్షానికి తడిసిన గోడలను, విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదు. విద్యుత్ సరఫరా, ప్రమాదాల సమయాల్లో టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 0028, హెల్ప్‌లైన్ 1912 నంబర్, వాట్సాప్ నంబర్ 87124 81489 ద్వారా విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలుపుతున్నారు.
ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి
వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు కూలడం, విద్యుత్ తీగలు తెగి పడడం వంటివి జరిగితే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలి. సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. – పి. విజేందర్‌రెడ్డి, ఎస్‌ఈ
●
అత్యవసర సేవలకు 1912 టోల్‌ఫ్రీ నంబర్
వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం
వాట్సాప్ నంబర్ 87124 81489 ద్వారా విద్యుత్ సేవలు


