న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్: మూసపద్ధతిలో వ్యవసాయం చేసి పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల పాలు అవుతున్న సంఘటనలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. కాగా, రైతులను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ పంట సాగు జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు పంట కాపుకు వచ్చింది. దీంతో రైతుల ఇంటి గెలల పంట పండుతోంది.
తొమ్మిదివేల ఎకరాలకు చేరిన సాగు..
జిల్లా రైతులు ముందుగా ఆయిల్‌పామ్ సాగుకు వెనకడుగు వేశారు. అయితే ఒకరిని చూసి మరొ కరు ఏటేటా సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. ఇలా 700 ఎకరాలతో మొదలైన సాగు ఇప్పుడు 9వేల ఎకరాల మేరకు చేరింది. అయితే ఎక్కువ మొత్తంలో భూములు ఉండి, సాగునీటి ఇబ్బందులు లేని రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. కోతుల బాధ లేకపోవడమే సాగుకు ప్రధాన కారణంగా రైతులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి మొక్కలకు రూ. 12వేలు, డ్రిప్‌నకు రూ. 22వేలు, మెయింటెనెన్స్‌కు రూ.16,800, మొత్తం ఎకరానికి నాలుగు సంవత్సరాలకు రూ. 52వేల మేరకు వందశాతం సబ్సిడీ ఇస్తుంది. కాగా వచ్చే ఏడాది మరో నాలుగు వేల ఎకరాల మేరకు సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అందుబాటులోకి మార్కెటింగ్..
అయిల్‌పామ్ పంట సాగు సరే.. మార్కెటింగ్ ఎక్కడ అనే ప్రశ్న ప్రతీ రైతుల్లో ఉండేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు వెళ్లి అమ్మాలనే భయపడేవారు. కానీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెటలో ఫ్యాక్టరీని ప్రారంభించారు. దీనికి తోడు ఇప్పుడు జిల్లాలోని కందికొండ, హరిపిరాలలతోపాటు గత రెండు రోజుల క్రితం కేసముద్రంలో అయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. దీంతో జిల్లా నలుమూలల ఆయిల్‌పామ్ సాగుచేసిన రైతులు సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లో గెలలు అమ్ముకునే అవకాశం వచ్చింది.
పంటల కాపు..
మొక్కలు నాటి ఐదు సంవత్సరాలు కావడంతో ఈ ఏడాది పంట చేతికి వస్తోంది. మొత్తం 9వేల ఎకరాల్లో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాల్లో వేసిన పంటలు కాపుకు వచ్చాయి. గెలలు కోసి మార్కెట్‌కు తెస్తున్నారు. టన్నుకు రూ. 23వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ప్రస్తుతం ఎకరాకు నెలకు రూ. 10వేల నుంచి రూ. 20వేల మేరకు రైతుకు ఆదాయం వస్తుంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొత్తం 8వేల టన్నుల దిగుబడి అంచనా వేశామని, ఈ అంచనా ఏటేటా పెరుగుతూ వస్తుందని అధికారులు అంటున్నారు.
జిల్లాలో ఆయిల్‌పామ్ పంట దిగుబడి
4వేల ఎకరాల్లో కోతలు షురూ
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
వచ్చే ఏడాది మరింత పెరగనున్న
సాగు విస్తీర్ణం


