హన్మకొండ చౌరస్తా: ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యతని, అందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, ఆహారం, తాగునీరు అంశాలపై ప్రజలు అవగాహనతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, ఫుడ్‌సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ కాలనీని అభివృద్ధి చేస్తా
నయీంనగర్: ఐదేళ్లలో ప్రతీ కాలనీని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. 54వ డివిజన్ అపూర్వ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులను వేగంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ గుంటి రజిత, కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


