మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్‌లో మంజూరైన మెగా ప్రైట్ మెయింటెనెన్స్ డిపో పనులను ప్రారంభించాలని కోరుతూ బీ ఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, బీఆర్‌ఎస్ ఎంపీల బృందం.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మహబూబాబాద్ మెగా ప్రైట్ మెయింటెనెన్స్ డిపో, రైల్వే అభివృద్ధిపై వారు సుదీర్ఘంగా చర్చించారు. స్పందించిన కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టు పురోగతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వ్యాధి నివారణకు అవగాహన ముఖ్యం
నెహ్రూసెంటర్:హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నివా రణలో అవగాహన ఎంతో ముఖ్యమని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, చికిత్స, కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లింక్ వర్కర్స్, సర్వోదయ స్వచ్ఛంద సంస్థ, కోఆర్డినేటర్స్ సమన్వయంతో పని చేస్తూ కేసుల గుర్తింపు, చికిత్సపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ప్రొగ్రాం అధికారి అర్జున్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, డెమో ప్రసాద్, హెచ్‌ఈ కేవీ రాజు, నీలిమాశ్వేత, అశోక్, సారంగం పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
గార్ల: విద్యార్థులకు ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాంనాయక్ అన్నారు. బుధవారం రాత్రి గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వంట వర్కర్లకు కూరలు నాణ్యమైన కూరగాయాలతో వండాలని సూచించారు. కూరలు రుచిగా లేవని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే వేటు తప్పదని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో మెనూ అమలుపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థుల పడక గదుల్లో సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీడీ వెంట హెచ్‌ఎం జోగయ్య, వార్డెన్ మేగ్యానాయక్, పీడీ పద్మ ఉన్నారు .
‘ఏప్రిల్‌ను మహనీయుల మాసంగా నిర్వహించాలి’
మహబూబాబాద్ అర్బన్: ఏప్రిల్ నెలల్లో జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహనీయుల మాసంగా నిర్వహించాలని డీపీఆర్‌ఓ పసూనూరి రాజేందర్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పౌరసంబంధల శాఖ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల మహనీయుల మాసం కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు మద్దెల వీరస్వామి, జిల్లా కార్యదర్శులు దాసరి మహేందర్, గంగుల రమేష్, జక్కుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.


