మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యో తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విడుదల చేయించిన రూ.60 కోట్ల నిధుల జీఓ వచ్చిందా.. వస్తే ఎందుకు బడ్జెట్‌లో పొందుపర్చలేదని కమిషనర్‌తో కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ స్నేహ శబరీష్ సైతం కమిషనర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చైర్‌పర్సన్‌కు అయినా జీఓ చూపించారా లేదా అని సీరియస్ అయ్యారు. దీంతో కమిషనర్ మళ్లీ బడ్జెట్ రూ.92,66,70,000 రూపకల్పన చేసి ప్రవేశపెట్టారు.
సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు..
సీపీఐ కౌన్సిలర్ అజయ్‌సారథిరెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రవికుమార్ అభ్యంతరం తెలిపారు. కేవలం బడ్జెట్ గురించి మాట్లాడాలని, వేరే విషయాలు వద్దని రవికుమార్ అనడంతో సీపీఐ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్..
19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చిదిరాల అరుణ పారిశుద్ధ్యం తదితర సమస్యలపై మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గుండా రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. కేవలం బడ్జెట్ గురించి మాట్లాడాలని, ఇతర విషయాలపై మాట్లాడొద్దన్నారు. ఈక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది.
రూ.60కోట్ల నిధులపై లొల్లి..
ఎమ్మెల్యే విడుదల చేయించిన రూ.60 కోట్ల నిధుల జీఓ వచ్చిందా.. ఫైనాన్స్ క్లియర్ అయిందా.. లేకుంటే కమిషనర్ బాధ్యత వహించాల్సి వస్తుందని పలువురు కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. అనంతరం రూ.92,66,70,000 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమోదించారు.
మున్సిపల్ చట్టాన్ని చదవాలి: కలెక్టర్
ముందుగా ప్రతీ కౌన్సిలర్ మున్సిపల్ చట్టాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కృషి చేయడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి గత ఏడాది రూ.30 లక్షలు వస్తే.. ఈ ఏడాది రూ.6కోట్లు ఎలా వస్తాయని, అధికారులు బడ్జెట్ రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. వాహనాలు ఎక్కువగా మరమ్మతుల బారిన పడుతున్నాయన్నారు. నిధులు రావడం లేదని, స్టాఫ్ సక్రమంగా రావడం లేదని కలెక్టర్‌కు వివరించారు. వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. మున్సిపల్ ఆదాయం పెంచుకోవాలన్నారు. తొర్రూరు బస్టాండ్ ఏరియాలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో కమిషనర్ రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, టీపీఓ సాయిరాం, మేనేజర్ శ్రీధర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, శ్రీహరి, అధికారులు తదిత రులు పాల్గొన్నారు.


