హసన్‌పర్తి : మండలంలోని ఎర్రగట్టు గుట్ట సమీపంలో గల షైన్ పబ్లిక్ స్కూల్‌లో నేడు (ఆదివారం) మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు షైన్ విద్యా సంస్థల చైర్మన్ ఎం.కుమార్ యాదవ్, ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 4వ తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఈ టెస్ట్‌కు అర్హులని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఆయా తరగతులకు సంబంధించిన ప్రశ్నలు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఆంగ్లంలో ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
విజిలెన్స్ విచారణ
హన్మకొండ : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని దేవోజి తండా సబ్‌స్టేషన్ బోరు నీటిని హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి సాగు నీటి అవసరాలకు వినియోగించడంపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నెల 24న సబ్ స్టేషన్ బోరు పరుల పాలు, దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎన్పీడీసీఎల్ అధికారి అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు విచారణకు సిద్ధమయ్యారు.
వాగులో పడి ఒకరి మృతి
బయ్యారం : అలిగేరు వాగులో పడి ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన శనివారం మండలంలోని చింతోనిగుంపు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొనక రాములు (53) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. శుక్రవారం గొర్రెలను మేపేందుకు వెళ్లి సాయంత్రం వాటిని అలిగేరు వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు గుంతలోపడి మునిగాడు. శనివారం ఉదయం వాగు ప్రాంతలో ఓ గుంతలో తేలిన మృతదేహం తేలడంతో అది రాములుదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
సిగ్నల్ లోపం..
నిలిచిన వందేభారత్ రైలు
స్టేషన్‌ఘన్‌పూర్ : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాతగేటు వద్ద శనివారం సాయంత్రం నిలిచిపోయింది. సిగ్నల్‌లో సాంకేతిక లోపం వల్ల సాయంత్రం 4:15 నుంచి 4:25 నిమిషాల వరకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో వందేభారత్ రైలును నిలిపారు. అనంతరం సాంకేతిక లోపాన్ని సరిచేసి కాజీపేట వైపునకు పంపారు.


