మామిడి రైతు విలవిల.. | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతు విలవిల..

Mar 27 2026 9:57 AM | Updated on Mar 27 2026 9:57 AM

బయ్యారం: ఆరంభంలో ఆశాజనకంగా వచ్చిన పూతను చూసి మురిసిపోయిన మామిడి రైతు.. తామర పురుగు ఉధృతితో పిందె, కాయలు రాలుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని సంవత్సరాలుగా మామిడిరైతు నష్టాలపాలవుతున్నాడు. అయితే, ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కుతామని భావించిన మామిడి రైతు ఆశలను తామరపురుగు తుంచేసింది. మామిడి పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 13 వేల ఎకరాల్లో సాగు..

జిల్లాలోని 18 మండలాల పరిఽధిలో 13వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. ప్రస్తుతం పిందె నుంచి కాత దశలో పంట ఉంది. ప్రారంభంలో తామర పురుగు ఉధృతి పెరగడంతో ఎక్కువ సంఖ్యలో పూతతో పాటు పిందెలు రాలినట్టు రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు పగలు, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు కూడా మామిడి పంటపై ప్రభావం చూపినట్లు రైతులు చెబుతున్నారు.

ముప్పావు వంతు పూత

రాలిపోయింది

మామిడితోటలో మొదట వచ్చిన పూతతో లాభాలు వస్తాయనుకున్నాం. రోజురోజుకూ పూత, పిందె, కాయలు రాలడం పెరిగింది. ప్రస్తుతం రూపాయిలో పావులా వంతు మాత్రమే కాయలు వచ్చాయి. ఎన్ని మందులు కొట్టిన కాత నిలువలేదు. ఏటా ఏదో ఒకవిధంగా నష్టపోవాల్సి వస్తోంది.

– కోడి శ్రీను, కౌలు రైతు, బాలాజీపేట

అక్కడక్కడ కాయలు ఉన్నాయి

నాకున్న ఐదెకరాల మామిడి తోటలో పూత, పిందె రాలిపోగా ఇప్పుడు అక్కడక్కడ కాయలు ఉన్నాయి. ఈ కాయల కోసం కోతులు రాకుండా కాపలా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న కాయల డబ్బులు తోటకు కాపలా ఉన్న వారి జీతాలకే సరిపోయేలా లేవు.

– పి.శ్రీరాములు, కొత్తపేట

తోటల్లో తామర పురుగు ఉధృతి

రాలుతున్న పిందె, కాయలు

వరుస నష్టాలతో రైతుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement