హన్మకొండ: సహకార సంఘాలను బలోపేతం చేయాలని వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో వరంగల్ డీసీసీబీ మహాజన సభ నిర్వహించారు. ఈ సభకు చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ డిపాజిట్ సేకరణ, రుణవితరణలో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, లాభాల దిశగా వరంగల్ డీసీసీబీ ముందుకు సాగుతోందన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు సమయానికి రుణాలు అందజేసి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. పీఏసీ యాక్సిలరేటరీ ప్రోగ్రామ్ కింద నాబార్డు సహకారంతో నాలుగు సంఘాలకు డ్రోన్లు, జన ఔషధి కేంద్రాల స్థాపనకు తక్కువ వడ్డీపై రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇదే దారిలో ఇతర సంఘాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రావాలని సూచించారు. బ్యాంకు పరిపాలన నివేదిక, 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను మహాజనసభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా, రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.195.58 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టగా మహాజన సభ ఆమోదం తెలిపింది. ఈ మహాజన సభలో నాబార్డు డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జిల్లా సహకార అధికారులు సంజీవరెడ్డి, నీరజ, వాల్యానాయక్, కోదండ రాములు, వరలక్ష్మి, రామ్మోహన్, వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, ఓఎస్‌డీ విజయలక్ష్మి డీసీసీబీ జీఎం ఉషశ్రీ, డీజీఎం అశోక్, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్ చాహత్ బాజ్‌పాయ్


