ఎన్జీఓల సాయంతో మానవ అక్రమ రవాణా నివారణ | - | Sakshi
Sakshi News home page

ఎన్జీఓల సాయంతో మానవ అక్రమ రవాణా నివారణ

Mar 26 2026 10:30 AM | Updated on Mar 26 2026 10:30 AM

హన్మకొండ: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సాయంతో వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణాను నిర్మూలించవచ్చని వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.శ్యాంసుందర్‌ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవాసంస్థ డైరెక్టర్‌ సిస్టర్‌ సహాయ అధ్యక్షతన బుధవారం వరంగల్‌, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణ నిర్మూలనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ఇంకా వెట్టిచాకిరి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ రవాణకు గురైన వ్యక్తులు వెట్టిచాకిరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. చట్టం ప్రకారం కొన్ని అంశాలను ఆధారం చేసుకుని స్వచ్ఛంద సంస్థలు గుర్తించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అధిక వేతనాల ఆశ చూపి ఎక్కువ పనిగంటలు చేయించుకుంటారని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పనిప్రాంతాలు, గ్రామాల నుంచి వలస వెళ్తున్న ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. వెట్టిచాకిరిలోకి నెడితే బీఎన్‌ఎస్‌, వెట్టి చాకిరి నిర్మూలన చట్టం, 1976 ప్రకారం చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జువైనల్‌ జస్టిస్‌ బోర్డు మెంబర్‌ డాక్టర్‌ గోపికారాణి, సీడబ్ల్యూసీ సభ్యులు సుధాకర్‌, సుజాత, డేవిడ్‌, చైల్డ్‌రైట్స్‌ అడ్వకసీ ఫోరం కన్వీనర్‌ మండల పరశురాములు, ఎఫ్‌ఎంఎం కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్‌, సిబ్బంది ఇక్బాల్‌సాషా, అజయ్‌ కుమార్‌, ప్రదీప్‌, ప్రసాద్‌, సుదర్శన్‌, నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement