కొనుగోలు కేంద్రాల వివరాలు
ఐకేపీ : 52
పీఏసీఎస్ : 143
జీసీసీ : 08
ఇతర కొనుగోలు
కేంద్రాలు : 01
మొత్తం : 204
యాసంగిలో 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
సాక్షి, మహబూబాబాద్: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, నిల్వలు, ట్రాన్స్‌పోర్టు మొదలైన అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రైస్ మిల్లుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్, ఇతర అధికారులు ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
యాసంగి సీజన్‌లో 2,60,762 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 1,71,780 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈమేరకు 3,77,916 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. అయితే ఇందులో రైతుల అవసరాలు, తిండి గింజలకు, ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లకు 1,17,154 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన 1,18,480 మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు, 1,42,282 మెట్రిక్ టన్నులు సన్న రకాలు.. మొత్తం 2,60,762 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనున్నారు.
65లక్షల గన్నీ బ్యాగులు అవసరం
నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు 65,19,076 గన్నీ బ్యాగులు అవసరం. అయితే ఇందులో 35,20,301 గన్నీ బ్యాగులు కొత్తవి, 29,98,775 గన్నీలు పాతవి అవసరం ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 5లక్షల గన్నీ బ్యాగులు పాతవి, 4,10,000 కొత్త గన్నీలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 31,10,301 కొత్తవి, 24,98,775 గన్నీలు పాతవి మొత్తం 56,09,076 సంచులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
రవాణా ఇబ్బందు లేకుండా..
కొనుగోలు చేసి కాంటా పెట్టిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీల సరఫరా కోసం టెండర్లు పూర్తి చేశా రు. గతంలో ఐదు సెక్టార్ల ద్వారా లారీల సరఫరా చేసేందుకు టెండర్ వేసి అంగీకారం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు పెట్టలేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి మరో రెండు సెక్టార్లు పెంచి మొత్తం మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు, డోర్నకల్ సెక్టార్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో ఏడు సెక్టార్ల నుంచి ఒక్కో సెక్టార్‌కు 60 లారీల చొప్పున మొత్తం 430 లారీలు జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి.
ఏప్రిల్ రెండో వారంలో..
జిల్లాలోని యాసంగి కోతలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం 204 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ముందస్తు కోతలు ఉండే తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లి మండలాల్లో ముందుగా ప్రారంభిస్తామని, దశలవారీగా ధాన్యం రాకను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
సర్వం సిద్ధం చేస్తున్నాం..
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా లారీల సంఖ్యను పెంచడం, లోడింగ్, అన్‌లోడింగ్‌లో సమస్య రాకుండా చూసుకునేందుకు మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎక్కువ రోజులు ఉండకుండా చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఉండేలా చూస్తున్నాం.
– అనిల్ కుమార్, అదనపు కలెక్టర్
204 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
నిల్వల కోసం మిల్లర్లతో సమీక్షలు
ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు
కొనుగోలు కేంద్రాల్లో పరికరాలు ఇలా..
పరికరాలు అవసరం ఉన్నవి కావాల్సినవి
టార్పాలిన్లు 12,122 7,396 4,726
తేమశాతం కొలిచే యంత్రాలు 447 296 151
ఎలక్ట్రానిక్ కాంటాలు 761 736 25
మాన్యువల్ ప్యాడీ క్లీనర్లు 423 246 177
ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు 31 06 25
ధాన్యం పరీక్షించే యంత్రాలు 235 216 19
డ్రయర్స్ 91 02 89
డిజిటల్ కాలిపర్స్ 236 216 20


