కాజీపేట అర్బన్: అదనపు కట్నం కోసమే మామ భాషబోయిన రాజశేఖర్, భార్య రాజశ్రీని భర్త పొక్కుల ప్రవీణ్ హత్య చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం మడికొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల కడిపికొండ రాజీవ్‌గృహకల్ప సముదాయంలో జరిగిన తండ్రీకూతుళ్ల హత్య వివరాలు వెల్లడించారు. కడిపికొండ రాజీవ్‌గృహకల్ప సముదాయంలో నివాసముంటున్న భాషబోయిన రాజశేఖర్ తన పెద్ద కుమార్తె రాజశ్రీని 2023, నవంబర్ 18వ తేదీన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన పొక్కుల ప్రవీణ్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహ సమయంలో రూ. 3 లక్షల కట్నంతోపాటు అన్ని రకాల సామగ్రి అందజేశాడు. ప్రవీణ్, రాజశ్రీ దంపతులకు ఏడాదిన్నర కుమారుడు జయాన్స్, ఆరు నెలల కూతురు దివిషా ఉన్నారు. ఈ క్రమంలో కూతురు పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని కొకాకోలా కంపెనీలో ఉద్యోగం మానేసి వ్యాపారం ఏర్పాటు చేసుకుంటానని, అందుకు అదనపు కట్నం తీసుకురావాలని ప్రవీణ్.. భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయంపై రాజశ్రీ తన తండ్రి రాజశేఖర్‌కు పలుమార్లు తెలిపింది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో తండ్రి రాజశేఖర్ తన బిడ్డను వేధిస్తే చంపుతానని ప్రవీణ్‌ను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన రాజశ్రీ, ప్రవీణ్ మధ్య అదనపు కట్నం విషయంపై గొడవ జరిగింది. ఈ సమయంలో అదే గదిలో ఉన్న మామ తనను చంపుతాడని ప్రవీణ్ బయపడ్డాడు. దీంతో తానే ఇద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్లాన్ ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున మామ రాజశేఖర్, భార్య రాజశ్రీ నుదుటిపై సుత్తితో మోదాడు. వారు బతికుంటే తనకు ప్రమాదమని భావించి డీజిల్ పోసి నిప్పటించాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు పిల్లలను తీసుకుని బయటకొచ్చి ఇరుగుపొరుగు వారిని నమ్మించేందుకు యత్నించాడు. వెంటనే 108, డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో రాజశేఖర్ రెండో కుమార్తె తేజశ్రీ ఘటనా స్థలికి చేరుకుని ఎలా చనిపోయారని ప్రవీణ్‌ను ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని వారిలో వారే గొడవపడి కాల్చుకున్నారని తెలిపి పరారయ్యాడు. శనివారం సాయంత్రం తన పిల్లలతో పాటు తనపై కేసు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కడిపికొండ బ్రిడ్జి ప్రాంతంలో కనిపించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా మామ, భార్యను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజ్‌కుమార్, రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
మామ, భార్యను చంపిన ఘటనలో
నిందితుడి అరెస్ట్
వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి


