హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో 56 శాతం ఉన్న బీసీలకు 3.8 శాతం మాత్రమే నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీమనోహర్ అన్నారు. 2026–2027 బడ్జెట్‌లో బలహీనవర్గాల కు తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసనగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ తీరును నిరసిస్తూ బడ్జెట్ ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె.మురళీమనోహర్ మాట్లాడుతూ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రతీ బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని విస్మరించిందని మండిపడ్డారు. మూడు బడ్జెట్‌లలో ఇదే తీరుగా మోసం చేసిందన్నారు. ప్రొఫెసర్ ఎం.సారంగపాణి, ప్రొఫెసర్ వడ్డే రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో బీసీలకు తక్కువ నిధులు కేటాయించడంతో పాటు కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని విమర్శించారు. బీసీ సంఘాల నాయకులు బుట్టి శ్యామ్ యాదవ్, ఎదునూరి రాజ మొగిలి, చందా మల్ల య్య మాట్లాడుతూ బడ్జెట్‌లో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, వివిధ కుల సమాఖ్యలకు కేటాయిస్తున్న నిధుల్లో కూడా రూపాయి ఖర్చు చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు, నాయకులు దారబోయిన సతీశ్, ప్రొఫెసర్ బెనర్జీ, ప్రొఫెసర్ గోపు సుధాకర్, తాడిశెట్టి క్రాంతి, గొల్లపల్లి వీరస్వామి, ఆయా సంఘాల నాయకులు జిలకర శ్రీనివాస్, పల్లెబోయిన అశోక్, సంపత్ పటేల్, దార జనార్ధన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ మురళీమనోహర్
బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులపై
నిరసన


