పీజీతండా... గ్రాడ్యుయేట్ సర్పంచ్..
● ఆ ఊరిలో అందరూ పీజీలే..
దుగ్గొండి: అది ఓ మారుమూల గిరిజన తండా. గత ప్రభుత్వ కాలంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసే క్రమంలో ప్రత్యేక గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకుంది. ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో 120 నివాస గృహాలు ఉన్నాయి. 540 జనాభా ఉన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటికి ఓ గ్రాడ్యుయేట్ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా వివిధ రకాల డిపార్ట్‌మెంట్‌లలో ఊరి బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆ గ్రామం పీజీతండాగా గుర్తింపు పొందింది. గ్రామ పంచాయతీల గెజిట్‌లోనూ పీజీతండాగా గుర్తించ బడింది. ఈనెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికలలో డిగ్రీ పూర్తిచేసిన 30 సంవత్సరాల యువకుడు లావుడ్యా చంద్రశేఖర్ పోటీ చేసి గెలుపొందారు. గ్రామంలోని అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అందుకోసమే తాను సర్పంచ్ బరిలో నిలిచానని చంద్రశేఖర్ తెలిపారు.
మామ సపాయి.. కోడలు సర్పంచ్
బచ్చన్నపేట : మండలంలోని బోనకొల్లూర్ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన చిక్కుడు కల్పన మామ బాలయ్య ఆ గ్రామ సపాయిగా పని చేస్తున్నాడు. గత 35 ఏళ్లుగా బాలయ్య గ్రామ సపాయిగా విధులు నిర్వర్తిస్త్తున్నాడు. మామ సపాయి కావడంతో గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి కల్పనకు సులువుగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. బాలయ్య కుటుంబంలోని కోడలును సర్పంచ్‌గా ఆదరించడంపై ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పీజీతండా... గ్రాడ్యుయేట్ సర్పంచ్..
పీజీతండా... గ్రాడ్యుయేట్ సర్పంచ్..


