పోరు రసవత్తరం!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు మూడో విడత ఎన్నికల పోలింగ్‌పై దృష్టిపెట్టారు. ఇదే ఆఖరి మోఖాగా భావించి రెండు పార్టీల నాయకులు తమ మద్దతుదారులను సర్పంచ్‌లుగా గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడో విడతలో డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, డోర్నకల్, కురవి, సీరోలు, ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 169 జీపీలు ఉండగా 19 పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. మిగిలిన పంచాయతీల్లో మూడో విడత పోరు రసవత్తరంగా సాగుతోంది.
హస్తగతం కోసం..
గ్రామ పంచాయతీలు ఎక్కువగా గెలుచుకోవడం అంటే చేసిన పనికి మార్కులు వేయించుకోవడం.. మీ బలం ఏంటో తెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ పార్టీ నాయకులు అత్యధికంగా సర్పంచ్ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర సీ్త్ర, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. తన సొంత మండలం కొత్తగూడలో ఒక్క సీటు కూడా వేరే పార్టీకి పోకుండా అన్ని స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా గంగారం మండలంలో సీతక్క కోడలు కుసుమాంజలి ప్రచారం చేశారు. కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయాలని కార్యకర్తలకు చెప్పి ప్రచారం ముమ్మరం చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెన్ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రచారం చేయడం, సభలు పెట్టి కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
మాజీ మంత్రులు..
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడానికి మాజీ మంత్రులు డీఎస్. రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెడ్యానాయక్ తన నియోజకవర్గంలోని మరిపెడ, కురవి, డోర్నకల్, సీరోలు మండలాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. సత్యవతి రాథోడ్ సొంత మండలం కురవితోపాటు ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి, స్థానిక నాయకులను కలుపుకొని మంత్రి సీతక్క ఇలాఖాలో ఎక్కువ సీట్లు బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచేలా ప్రయత్నం చేస్తున్నారు.
నేడు చివరి దశ పంచాయతీ
ఎన్నికల ప్రక్రియ
హస్తగతం కోసం మంత్రి,
ఎమ్మెల్యే ప్రయత్నాలు
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
మాజీ మంత్రులు
ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల యుద్ధం
విమర్శలు.. ప్రతి విమర్శలు..
పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరడంతో ఇదే ఆఖరి మోఖాగా భావించి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి రెడ్యానాయక్ ప్రస్తుత ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌పై చేసిన విమర్శలు రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారాయి. సూర్యాపేటలో ఎమ్మెల్యే నేరచరిత్ర ఉందని, ఆయన క్యారెక్టర్ మంచిది కాదని మాజీమంత్రి బహిరంగంగా చెప్పి అందరని విస్మయానికి గురిచేశారు. అలాగే ఎమ్మెల్యే రాంచంద్రునాయక్... మాజీ మంత్రి రెడ్యానాయక్, బీఆర్‌ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టడం, వారు చేసిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గంలోని ఒక నాయకుడిపై మంత్రి సీతక్క చేసిన విమర్శలకు బీఆర్‌ఎస్ నాయకులు ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బడే నాగజ్యోతి విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్కను విమర్శించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు నాయకులు చేస్తున్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


