ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పాలన
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య
నెహ్రూసెంటర్: దేశంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ప్రజల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి వీరయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గంగపుత్ర భవన్‌లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహా సభను దివిల వెంకటరాజు అధ్యక్షతన నిర్వహించారు. వీరయ్య మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన రిటైర్డ్ ఉద్యోగులను పాలకులు విస్మరిస్తున్నారని, వారికి చెల్లించాల్సిన పెన్షన్ ను సైతం ఎత్తివేసేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని, వాలిడేషన్ ఆఫ్ పెన్షనర్స్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రతీ ఐదేళ్లకు ఓసారి పే రివి జన్ కమిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 70ఏళ్ల నుంచే అదనపు పెన్షన్ వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల డీఏ, డీఆర్‌లను వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నా రు. అదానీ, అంబానీ, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాటుపడుతున్నాయని, హక్కులు, చట్టాల అమలు కోసం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లింగ అరుణ, తూపురాణి సీతారాం, యాకూబ్, మల్లయ్య, పి.రాజయ్య, డీటీఓ వి.సత్యనారాయణ, పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు.


