జీపీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని డోర్నకల్, కురవి, సీరోలు, మరిపెడ, గంగారం, కొత్తగూడ మండలాల్లో జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేశామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలసత్వం వహించొద్దన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఐదుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు, 50మంది ఎస్సైలు, సుమారు వెయ్యి మంది సిబ్బందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వద్ద, 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమనిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిలేదని, బాణసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


