రెమ్యునరేషన్ ఇవ్వాలి
గైడ్‌లైన్స్
మేరకు
కాళేశ్వరం: రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం తమకు రూ.2,500 రెమ్యునరేషన్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రాలకు వెళ్లకుండా మూడు గంటలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మహదేవపూర్ మండల కేంద్రంలో మూడో విడతలో భాగంగా పోలింగ్ కేంద్రానికి తరలి వెళ్లకుండా జిల్లాపరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద భోజన విరామం అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకటి, రెండు విడతల్లో విధులు నిర్వర్తించిన పోలింగ్ సిబ్బందికి రూ.2,500 ఇవ్వకుండా రూ.1,500 ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ప్రస్తుతం మూడో విడతలోనూ అధికారులు అదే విధానాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. రూ.2,500తో పాటు ఒక రోజు ఆన్‌డ్యూటీ(ఓడీ) ఇవ్వాలని భీష్మించారు. సాయంత్రం వరకూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్దనే వేచి ఉన్నారు. ఈ ఘటన తెలుసుకున్న కలెక్టర్ రూ.2 వేలు ఇస్తున్నట్లు తెలపడంతో ఎంపీడీఓ రవీంద్రనాథ్.. పోలింగ్ సిబ్బందికి హామీ ఇచ్చారు. అలాగే, ఓడీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపుతున్నట్లు పేర్కొనడంతో పోలింగ్ సిబ్బంది నిరసన విరమించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వారికి కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలింగ్ సిబ్బంది డిమాండ్
కేంద్రాలకు వెళ్లకుండా మూడు గంటలు నిరసన
దిగొచ్చిన జిల్లా అధికారులు
రూ.2వేలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో
తరలిన సిబ్బంది
రెమ్యునరేషన్ ఇవ్వాలి


