జనరల్ స్థానంలో దళిత యువకుడి గెలుపు
లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో జనరల్ స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన గాదెపాక విష్ణు విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడిగా (ఎంఏ,బీఈడీ) గ్రామంలోనే ఉంటూ బీఆర్‌ఎస్‌లో చురుగ్గా పని చేసేవాడు. అతనికి బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వకుండా మరో అభ్యర్థిని ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ రెబల్‌గా పోటీ చేసి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి ఎనగందుల వెంకన్న (కాంగ్రెస్ బలపరిచిన) పై 85 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1,177 ఓట్లకు గాను 1044 పోలైయ్యాయి. అందులో గాదెపాక విష్ణుకు 438 రాగా, ఎనగందుల వెంకన్నకు 353 ఓట్లు వచ్చాయి. గ్రామంలోనే ఉంటూ ప్రజాసేవలో ఉన్న వ్యక్తులను ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారని నూతనంగా ఎన్నికై న సర్పంచ్ విష్ణు అంటున్నాడు. అదేవిధంగా చీటూరులో ఎస్సీ రిజర్వ్ స్థానంలో బర్ల గణేశ్ కాంగ్రెస్ రెబెల్‌గా పోటీ చేసి విజయం సాధించారు.


