చలిమంటల్లో పడి వృద్ధుడి మృతి
● లోహితలో ఘటన
సంగెం: చలిమంటల్లో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలం లోహితలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తునికి రజిత, శివ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరితో పాటు రజిత తల్లిదండ్రులు బొమ్మెర కమల, యాకయ్య(65) కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి యాకయ్య చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో పడ్డాడు. శరీరం కాలుతుండగా కేకలు వేయడంతో కూతురు రజిత, భార్య కమల వచ్చి చద్దర్లతో మంటలు ఆర్పారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన 108లో ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.


