ఎన్నికల్లో నేరాలకు పాల్పడితే అనర్హతే..
నానమ్మ.. నామినేషన్ ఖర్చులు మావే
‘జాక్‌పాట్ సర్పంచ్’ మల్లమ్మ నామినేషన్
ఏం జేయాల్నో తెలుస్తలేదు..!
గీసుకొండ : నాకు బాగా గుబులైతాంది.. ఏం జేయాల్నో తెలుస్తలేదు. సర్పంచ్ ఎలచ్చన్ల ఎవరికి ఓటేయాల్నో సమజైత లేదు.. పిచ్చి లేత్తాంది. మైండ్ గరమైతాంది. మా ఊళ్లే అందరూ నాకు గావాల్సిన వాళ్లే.. ఒకాయన సర్పంచ్‌గా నన్ను గెలిపిస్తే తన భూమిని ఊరికి రాసిస్తానంటాండు. మరొకాయన పంచాయతీలో పొటీకి భూమిని అమ్మకానికి బేరం పెట్టిన అంటాండు.. కొందరైతే ఎన్నడూ లేంది గుడి, బడి కట్టిస్తామంటుండ్లు. సొంత ఖర్చులతోటి రోడ్డు వేయిస్తామని చెబుతాండ్లు.. ఇంకొందరైతే ఓటుకు రూ.వెయ్యి ఇస్తామంటుడ్లు. రోజూ మందు పోయిస్తమని, చికెన్, మటన్ కూరలను వండించి పెడుతమని చెబుతాండ్లు. నన్ను రాజులా చూసుకుంటమని అంటుండ్లు.. నాకై తే వారి మాటలను వింటే పిచ్చిపిచ్చి అయితాంది. ఏం జేయాల్నో తెల్వడం లేదు. ఎవరికి ఓటోయాల్నో తెల్వక తలకాయను బండకు గుద్దుకోవాలనిపిస్తాంది.. ఓరీ దేవుడా.. నీవైనా నాకేమైన దారి చూపు..ఎవరికి ఓటేయాల్నో జర చెప్పు.. నీకు జన్మజన్మలా రుణపడి ఉంటా..
దంతాలపల్లి : ‘నానమ్మ నీ నామినేషన్ ఖర్చులు మావే’ అంటూ ఇద్దరు చిన్నారులు తాము దాచుకున్న చిల్లర నగదును ఓ పల్లెంలో తీసుకు వచ్చి అందజేసిన ఘటన గ్రామస్తులను ఆకట్టుకుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ‘నువ్వే సర్పంచ్‌గా ఉండాలని’ ఓ గ్రామస్తుడు కొమ్మినేని రాములమ్మ కాళ్లు పట్టుకున్న విషయం విదితమే. కాగా గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేయబోతున్న రాములమ్మకు తన మనుమరాళ్లు జీవనశ్రీ, దేవాన్షి మరుపు రాని చిరుకానుక ఇచ్చారు. తల్లిదండ్రులు తమకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులను గల్లగురిగిలో దాచుకున్నారు. నామినేషన్ వేయబోతున్న తమ నానమ్మ వాటిని పగులకొట్టి ఆ చిన్నారులు కానుకగా ఇచ్చారు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇట్లు..
ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఓటరు
జనగామ: భారత శిక్షాస్మృతి 1860లోని 9వ విభాగంలో ఎన్నికల్లో నేరానికి శిక్ష పడిన లేదా 242వ విభాగం ప్రకారం విచారణ జరిగిన శిక్షవిధించే అవకాశముంది. శిక్ష తేదీ నుంచి లేదా తీర్పు వెలువడిన నాటి నుంచి ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వారు అనర్హులు.
లెక్కలు చూపకపోతే మూడేళ్ల వేటు..
సర్పంచ్, మండల, జిల్లా ప్రజాపరిషత్ సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థి ఎన్నికల ఖర్చుల లెక్కలను నిర్ణీత గడువులో దాఖలు చేయాలి. ఒకవేళ చూపించని పక్షంలో ఎన్నికల సంఘానికి సరైన జవాబు ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు తెలంగాణ గెజిట్‌ను అనుసరించి ఉత్తర్వు విడుదల చేస్తుంది. దీని ద్వారా ఆ ఉత్తర్వుల తేదీ నుంచి మూడు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికే ఎన్నికై పదవిలో ఉన్నా వారిని తొలగించినట్టు ప్రకటించవచ్చు.
విధినిర్వహణలో వైఫల్యంపై అనర్హత..
గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ తమ బాధ్యతల్లో విఫలమై పదవి నుంచి తొలగిపోతే వారు తర్వాత ఆరేళ్ల పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇది పంచాయతీ పరిపాలనలో బాధ్యతను పెంచే కీలక నిబంధనగా భావించబడుతోంది. ఈ నిబంధన ఎన్నికల్లో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజాప్రతినిధుల బాధ్యతను బలోపేతం చేసే లక్ష్యంగా నిలుస్తున్నాయి.
కోతులను నియంత్రించిన వారికే ఓటు..
మరిపెడ రూరల్ : కోతుల బెడదను నియంత్రించిన వారికి తమ ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపిస్తామని మండలంలోని వీరారం గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. కోతుల బెడద కారణంగా పంటలు ధ్వంసం కావడంతో పాటు ఇళ్లలోకి చొరబడి వస్తువులన్ని చిందరవందర చేస్తున్నాయని అంటున్నారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపిన వారికే సర్పంచ్‌గా ఓటు వేస్తామన్నారు. వానరాల నివారణకు సర్పంచ్ అభ్యర్థులు ఎవరు ముందుకు వస్తారో వారికే తాము ఓటు వేస్తామన్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పోటీకి కలిసొచ్చిన ప్రేమపెళ్లిళ్లు..
కాజీపేట : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎంతో కాలంగా గ్రామానికి మొదటి పౌరుడిగా ఎంపిక కావాలని ఎదురు చూస్తున్న కొందరికి ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు నిరాశను మిగిల్చాయి. ఇదే రిజర్వేషన్లు మరికొంత మందికి తాము పోటీచేసే అవకాశం లేకున్నా తమ జీవిత భాగస్వాములకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించాయని సంబుర పడుతున్నారు. ధర్మసాగర్ మండల కేంద్రం ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాలకు చెందిన యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువకులు తమ భార్యలతో పోటీ చేయించేందుకు సమయత్తమయ్యారు. ముగ్గురు ఒకే రోజు తమ శ్రీమతులతో నామినేషన్ దాఖలు చేయించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓటరు దేవుళ్లు ఎవరి పక్షాన నిలబడి ఆశీర్వదిస్తారో వేచిచూడాల్సిందే.
● తెరపైకి ప్రేమవివాహం చేసుకున్న యువతి!
సంగెం : మండలంలోని ఆశాలపల్లి జాక్‌పాట్ సర్పంచ్‌గా పిలుచుకునే ఒకే ఒక ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్ యాదవ్, నాయకులు కొంతం దశరథంతో కలిసి ఆమె గవిచర్ల కేంద్రంలో నామినేషన్ వేశారు. గ్రామంలో ఎస్సీ జనాభా లేకపోవడం.. ఉన్న ఒకే ఒక్క మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కావడం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతిని రంగంలోకి దింపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు గ్రామంతో పాటుగా మండలంలో చర్చ జరుగుతోంది. నామినేషన్లకు ఒక్క రోజే గడువు ఉండడంతో మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఉత్కంఠకు తెరపడనుందని ఊహగానాలు వినవస్తున్నాయి. జాక్‌పాట్ సర్పంచ్‌గా మల్లమ్మ ఎన్నిక కానుందా లేక ప్రేమవివాహం యువతి తెరపైకి వస్తే, పోటీ పడి మల్లమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఎన్నికల్లో నేరాలకు పాల్పడితే అనర్హతే..
ఎన్నికల్లో నేరాలకు పాల్పడితే అనర్హతే..


