అంగన్‌వాడీల్లో అవస్థలు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో అవస్థలు

Oct 12 2025 6:55 AM | Updated on Oct 12 2025 6:55 AM

అంగన్‌వాడీల్లో అవస్థలు

అంగన్‌వాడీల్లో అవస్థలు

మహబూబాబాద్‌: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు అవస్థల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. ఏడు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బిల్లులు రాక అంగన్‌వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, గ్యాస్‌ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక పిల్లలు, గర్భిణులు, బాలింతలకు తిప్పలు తప్పడంలేదు. దీనికితోడు సిబ్బంది కొరతతో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పర్యవేక్షణ లోపంతో కొంతమంది టీచర్లు సమయపాలన పాటించడం లేదు.

1,435 కేంద్రాలు

జిల్లాలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,435 కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో డోర్నకల్‌, గార్ల, కురవి, గూడూరు ప్రాజెక్ట్‌ పరిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ మండలాలు, మానుకోట ప్రాజెక్ట్‌ పరిధిలో మానుకోట, బయ్యారం, కేసముద్రం, మరిపెడ ప్రాజెక్ట్‌ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు ప్రాజెక్ట్‌ పరిధిలో నెల్లికుదురు, తొర్రూరు, పెద్ద వంగర మండలాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలల లోపు పిల్లలు 3,604 మంది ఏడు నెల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 20,295 మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారు.

452 కేంద్రాలు అద్దె భవనాల్లోనే..

1,435 కేంద్రాల్లో 452 కేంద్రాలు అద్దె భవనాల్లో, 339 కేంద్రాలు సొంత భవనాల్లో, అద్దె లేకుండా (ప్రీరెటెండ్‌ ) భవనాల్లో 644 కేంద్రాలు కొనసాగుతున్నాయి. 732 సెంటర్లలో మరుగుదొడ్లు లేవు. 703 కేంద్రాల్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. 397 కేంద్రాల్లో తాగు నీటి సౌకర్యం లేక టీచర్లు, ఆయాలు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందిపడుతున్నారు.

ఏడు నెలల అద్దె బిల్లులు పెండింగ్‌లోనే..

ఈఏడాది జనవరి, ఫ్రిబవరి నెలల అద్దె బిల్లులు మాత్రమే వచ్చాయని అంగన్‌వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల బిల్లులు సైతం ఏడు నెలలుగా రాలేదని, నెలల తరబడి గ్యాస్‌ బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని చెబుతున్నారు.

ఖాళీ చేయాలంటున్న యజమానులు

నెలల తరబడి అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటున్నారు. ప్రతీరోజు ఏదో ఒకటి చెప్పి కేంద్రాలను నిర్వహిస్తున్నామని వాపోతున్నారు. ఎప్పుడు ఇచ్చేది తెలియకపోవడంతోపాటు వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందిపడాల్సి ఉంటుందని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..

బిల్లుల పెండింగ్‌ విషయంలో ఫైళ్లు పరిశీలించి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తా.. ఈ మధ్యనే జిల్లాకు బదిలీపై వచ్చాను. అన్ని విషయాలను తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తా. టీచర్లు సమయ పాలన పాటించాలి. మోనూ ప్రకారం భోజనం, పౌష్టికాహారం అందించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

– సబిత, జిల్లా సంక్షేమాధికారి

పెండింగ్‌లోనే కేంద్రాల అద్దె బిల్లులు

సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువు

వేధిస్తున్న సిబ్బంది కొరత

సమయ పాలన పాటించని పలువురు టీచర్లు

692 పోస్టులు ఖాళీగానే..

116మంది టీచర్లు, 576 ఆయా పోస్టులు మొత్తం 692 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 58 మంది సూపర్‌వైజర్లకు 46 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలతో పర్యవేక్షణ సక్రమంగా లేకుండా పోయింది. దీంతో కొంతమంది టీచర్లు సమయపాలన పాటించడం లేదు. కొంత మంది టీచర్లకు మరో కేంద్రం ఇన్‌చార్జ్‌ ఇవ్వడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement