
రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం
మహబూబాబాద్ రూరల్ : గంజాయి అమ్ముతున్న, సేవిస్తున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసి, రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శనివారం రాత్రి వెల్లడించారు. పట్టణంలో టౌన్ ఎస్సై మౌనిక తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. స్థానిక నిజాం చెరువుకట్ట సమీపంలో ఐదుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండి, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తోకబోడు తండాకు చెందిన లూనావత్ రవీందర్, అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంతానికి చెందిన భూక్య వినోద్, కాకతీయ కాలనీకి చెందిన లావుడ్య పవన్, భవానీ నగర్ తండాకు చెందిన భూక్య కుమార్, జగ్య తండాకు చెందిన భూక్య సాయిరాం గా గుర్తించి విచారణ చేసినట్లు తెలిపారు. వీరారం తండాకు చెందిన బాదావత్ ప్రశాంత్ భద్రాచలం, అరకు ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి తమకు విక్రయించేవాడని ఐదుగురు యువకులు ఒప్పుకున్నారు. అతని వద్ద గంజాయి కొనుగోలు చేసి వినియోగించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లుగా అంగీకరించినట్లు తెలిపారు. యువకుల వద్ద తనిఖీ చేయగా.. చిన్నచిన్న పొట్లాలుగా కట్టిన సుమారు రూ.1,27,500 విలువైన రెండున్నర కిలోల గంజాయి లభించిందన్నారు. ఐదుగురు యువకుల వద్ద నుంచి ద్విచక్ర వాహనం, 5 సెల్‌ఫోన్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించామని సీఐ తెలిపారు.
విక్రయ, వినియోగదారుల అరెస్టు
వివరాలు వెల్లడించిన సీఐ గట్ల మహేందర్ రెడ్డి