
లాభదాయక పంటలు సాగు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు లాభదాయకమైన పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. ప్రధాని మోదీ పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించగా మానుకోట రైతు వేదికలో వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయనిర్మల మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ ఉత్పాదన, సాంద్రత, రుణ పరపతి తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయం రెట్టింపు, వ్యవసాయంలో వస్తున్న మార్పులను రైతులకు తెలియజేయడం, లాభదాయక పంటలను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఆరేళ్లపాటు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం కొనసాగుతుందని, ఎంపిక చేసిన జిల్లాల్లో మొదటి విడతగా ప్రారంభించారన్నారు. సంప్రదాయ వ్యవసాయ విధానాలతోపాటు ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఏడీఏలు అజ్మీరా శ్రీనివాసరావు, విజయచంద్ర, మరిపెడ ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
డీఏఓ విజయనిర్మల
పీఎం ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం